MS Dhoni : నాకు ఎందుకు ఈ అవార్డు.. నేనేమంత గొప్ప‌గా ఆడా.. అదే ఆలోచిస్తున్నా..

ఐపీఎల్‌లో ధోని 18వ సారి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

MS Dhoni : నాకు ఎందుకు ఈ అవార్డు.. నేనేమంత గొప్ప‌గా ఆడా.. అదే ఆలోచిస్తున్నా..

Courtesy BCCI

Updated On : April 15, 2025 / 9:52 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎట్ట‌కేల‌కు మ‌రో విజ‌యాన్ని అందుకుంది. వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌ల్లో ఓట‌ముల‌తో డీలా ప‌డిపోయిన ఆ జ‌ట్టు సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ ద‌శ‌లో ఓట‌ముల్లో డ‌బుల్ హ్యాట్రిక్ కొడుతుందేమోన‌ని అనిపించింది. అయితే.. స‌రైన స‌మ‌యంలో ధోని మెరుపులు మెరిపించాడు. శివ‌మ్ దూబె స‌మ‌యోచితంగా రాణించ‌డంతో ఐదు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. అంత‌కముందు సీఎస్‌కే బౌల‌ర్లు స‌మిష్టిగా స‌త్తా చాటి ల‌క్నోకు క‌ళ్లెం వేశారు. ఈ సీజ‌న్‌లో తొలిసారి రాణించిన పంత్ ల‌క్నోను గెలిపించుకోలేక‌పోయాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్ (63; 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుష్ బ‌దోని (22)లు ప‌ర్వాలేద‌నిపించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా, మ‌తీషా ప‌తిర‌ణా చెరో రెండు వికెట్లు తీయ‌గా.. ఖ‌లీల్ అహ్మ‌ద్, అన్షుల్ కాంబోజ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

LSG vs CSK : వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌ల్లో ఓట‌ముల త‌రువాత విజ‌యం.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైర‌ల్‌.. ఇక‌నైనా జ‌ట్టు..

అనంత‌రం శివ‌మ్ దూబె (43 నాటౌట్; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ర‌చిన్ ర‌వీంద్ర (37; 22 బంతుల్లో 5 ఫోర్లు), షేక్ ర‌షీద్ (27; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఎంఎస్ ధోని (26 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని 19.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.

ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ధోని..

చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో వింటేజ్ ధోనిని గుర్తుకు తెస్తూ మ‌హేంద్రుడు చెల‌రేగాడు. 11 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 26 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. త‌న‌దైన శైలిలో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. దీంతో అత‌డికే ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

ఐపీఎల్‌లో ధోనికి ఇది 18వ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావ‌డం విశేషం. ఇదే విష‌యాన్ని ప్ర‌జెంటేష‌న్ కార్య‌క్ర‌మంలో హోస్ట్ ముర‌ళీ కార్తీక్ ప్ర‌స్తావించాడు. 18వ సారి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవ‌డం ఎలా అనిపిస్తుంద‌ని ధోనిని అడిగాడు. త‌న‌కు ఎందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తున్నారా? అని ఆలోచిస్తున్న‌ట్లు ధోని చెప్పాడు.

ఈ అవార్డు అందుకునే వ్య‌క్తులు చాలా మంది ఉన్నార‌న్నాడు. త‌న‌కంటే నూర్ అహ్మ‌ద్‌, ర‌వీంద్ర జ‌డేజాలు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశారని ధోని అభిప్రాయ‌ప‌డ్డారు. వీరిద్ద‌రు కూడా మిడిల్ ఓవ‌ర్ల‌లో చ‌క్క‌గా బౌలింగ్ చేశార‌ని చెప్పుకొచ్చాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేసిన అంపైర్‌.. ఏంద‌ప్పా ఇదీ..

ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు ఓవ‌ర్లు వేశాడు. ఒక్క వికెట్ తీయ‌క‌పోయినా కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అటు జ‌డేజా సైతం నాలుగు ఓవ‌ర్లు వేసి 24 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

ధోని చేసిన ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ధోనిది మంచి మ‌న‌సు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.