LSG vs CSK : వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటముల తరువాత విజయం.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైరల్.. ఇకనైనా జట్టు..
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తరువాత విజయం సాధించడంపై ధోని స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస ఓటముల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బయటపడింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయిన తరువాత ఓ విజయాన్ని అందుకుంది. సోమవారం ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో రిషబ్ పంత్ (63; 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుష్ బదోని (22)లు పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, మతీషా పతిరణా చెరో రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం శివమ్ దూబె (43 నాటౌట్; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (37; 22 బంతుల్లో 5 ఫోర్లు), షేక్ రషీద్ (27; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఎంఎస్ ధోని (26 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.
బ్యాటర్లు ఇంకా రాణించాలి..
లక్నో జట్టు పై విజయం అనంతరం ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఈ విజయం తమ జట్టు ప్రయాణాన్ని మారుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. వరుస ఓటముల తరువాత విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం రాణించిందని, బ్యాటింగ్‌లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలన్నాడు.
‘ఈ మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. ఇందుకు చాలా కారణాలు ఉండొచ్చు. ఈ విజయం జట్టుకు కావాల్సిన ఆత్మవిశ్వాన్ని ఇస్తుంది. దీంతో జట్టు విజయాల బాట పడుతుందని ఆశిస్తున్నాను. గత మ్యాచ్‌ల్లో మేం మొదటి ఆరు ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో పుంజుకునేవాళ్లం. ఇక బ్యాటింగ్‌లో ఆశించిన ఆరంభాలను అందుకోలేకపోయాం. చెన్నై వికెట్ కావడంతోనే మేం విఫలం అయ్యామని అనుకుంటున్నాను.’ అని ధోని అన్నాడు.
Hardik Pandya : హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేసిన అంపైర్.. ఏందప్పా ఇదీ..
పవర్ ప్లేలో అశ్విన్ చేత రెండు ఓవర్లు వేయించి అతడిపై ఒత్తిడి తీసుకువచ్చామన్నాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు ఎక్కువ బౌలింగ్ ఆప్షన్లు కావాలని, అందుకనే జట్టులో మార్పులు చేసినట్లుగా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ అటాక్ బాగుందన్నాడు. అయితే.. బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగు కావాల్సి ఉందన్నాడు.
రషీద్ సూపర్..
తెలుగు తేజం షేక్ రషీద్ పై ప్రసంశల వర్షం కురిపించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కితాబు ఇచ్చాడు. అతడు అందరిలా కాదని, తనదైన షాట్లతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే ఆటగాడని అన్నాడు. గత కొన్నేళ్లుగా అతడు జట్టుతో ప్రయాణం చేస్తున్నాడన్నాడు. ఈ ఏడాది అతడు నెట్స్‌లో పేసర్లు, స్పిన్నర్లు లను ఎంతో సమర్థవంతంగా ఆడుతున్నాడు. అందుకనే అతడికి అవకాశం ఇచ్చాం. మిగిలిన బ్యాటర్లలా కాకుండా తనదైన షాట్లతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే సామర్థ్యం అతడి సొంతమని ధోని అన్నాడు.