IPL 2025: భళా బెంగళూరు.. ఐపీఎల్ ఫైనల్‌కి ఆర్సీబీ.. క్వాలిఫయర్ 1 లో పంజాబ్‌‌పై తిరుగులేని విజయం..

బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు.

IPL 2025: భళా బెంగళూరు.. ఐపీఎల్ ఫైనల్‌కి ఆర్సీబీ.. క్వాలిఫయర్ 1 లో పంజాబ్‌‌పై తిరుగులేని విజయం..

Courtesy BCCI

Updated On : May 29, 2025 / 11:05 PM IST

IPL 2025: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అదరగొట్టింది. ఐపీఎల్ ఫైనల్ కు చేరింది. కీలకమైన క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో ఆర్సీబీ చెలరేగిపోయింది. పంజాబ్ కింగ్స్ పై తిరుగులేని విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో.. ఆదిలోనే పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఒక్క బ్యాటర్ కూడా 26కి పైగా రన్స్ చేయలేకపోయారు. ఆ జట్టులో హయ్యస్ట్ స్కోరర్ స్టోయినిస్. అతడు 26 పరుగులు చేశాడు. పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

బెంగళూరు బౌలర్లు అంతా చెలరేగిపోయారు. సుయాశ్ శర్మ, హేజిల్ వుడ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ చెరో వికెట్ తీశారు.

Also Read: ఈ క్రికెటర్‌ చేసిన ఒక్కో పరుగుకు రూ.10 లక్షల చొప్పున చెల్లించిన లక్నో సూపర్ జెయింట్స్‌.. మొత్తం రూ.27 కోట్లు వృథా

స్కోర్లు..
పంజాబ్ కింగ్స్ – 14.1 ఓవర్లలో 101 ఆలౌట్
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ – 10 ఓవర్లలో 106/2

కాగా, 9 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ పైనల్ కి దూసుకెళ్లడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ సాల కప్ నమ్దే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ టీమ్ బలంగా ఉందని.. బ్యాటింగ్ బౌలింగ్ లో తిరుగులేదని సంబరపడుతున్నారు. ఇక.. గత ఏడు సీజన్లలో క్వాలిఫయర్ 1లో గెలుపొందిన జట్టే కప్పు కొట్టింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈసారి ఆర్సీబీకి టైటిల్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.