ధోనీ గురించి ఇలా మాట్లాడారో..: ఫ్యాన్స్‌కి ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించాడు.

PIC: @BCCI
ఐపీఎల్‌లో సీఎస్‌కేకు కెప్టెన్‌గా 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ టైటిళ్లకు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ ఇవాళ.. రెండేళ్ల తర్వాత ఆ జట్టుకు సారథ్యం వహించాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకోవడంతో ధోనీ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించాడు. ఈ సందర్భంగా ధోనీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన యూబ్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చారు. అభిమానులు ఎమ్మెస్ ధోనీ వంటి ఆటగాళ్లపై విమర్శలు చేయాలనుకుంటే చేయొచ్చని అన్నారు. అయితే, విమర్శలను మర్యాదగా చేయాలని, విమర్శలకు తగ్గ కారణాలు చెప్పాలని తెలిపారు.
Also Read: అందుకే నేను మ్యాచ్ తర్వాత “కాంతార”లా ఇలా చేశాను: కేఎల్ రాహుల్
క్రికెటర్లు ఆడిన తీరు, చేసిన స్కోరును బట్టి ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వివరించాలని అన్నారు. అంతేగానీ, హద్దు మీరకూడదని చెప్పారు. “సరిగ్గా ఆడకూడదని ధోనీ తనకు తాను ఎన్నడూ అనుకోడు. స్టార్ ప్లేయర్లు బాగా ఆడకపోతే ఫ్యాన్స్ విమర్శించవచ్చు.
కానీ, ఓ పద్ధతి ఉండాలి. అభిమానులు ఆటలో చాలా ముఖ్యమైన భాగం. కాబట్టి, వారికి అభిప్రాయాలను పంచుకునే ప్రతి హక్కు ఉంది. అయితే, ప్లేయర్లను అగౌరవ పర్చకూడదు. ఎమ్మెస్ ధోనీ ఓ గొప్ప ఆటగాడు.. ఛాంపియన్ క్రికెటర్.. అతను భారత మాజీ కెప్టెన్. అతని కెప్టెన్సీలో జట్టు చాలా ట్రోఫీలు గెలుచుకుంది. అతను మ్యాచ్ విన్నర్.
అయితే, ఇప్పుడు మ్యాచ్ విన్నర్ కాదు.. అతను ఇప్పుడు మ్యాచ్‌లు గెలవలేడు.. మనం ఈ తీరును విమర్శించవచ్చు. కానీ, సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టిస్తున్నారు. దయచేసి అలా చేయకండి. అతడి స్కోరు ఆధారంగా విమర్శించండి. ఇలాచేస్తేనే నేను కూడా ఫ్యాన్స్‌కు మద్దతు ఇస్తాను. మేము కూడా విమర్శిస్తాము.. కానీ, మన మాటలు గౌరవంగా ఉండాలి. అది మీ అందరికీ నా సలహా” అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.