MI vs GT : భువనేశ్వర్‌కుమార్ రికార్డు బ్రేక్.. ఎలైట్ లిస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు చోటు..
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Jasprit Bumrah overtakes Bhuvneshwar Kumar to etch name in elite IPL list
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, షారుక్ ఖాన్‌లను ఔట్ చేశాడు. వీరిద్దరిని కూడా క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్లీన్ బౌల్డ్ లు చేసిన నాలుగో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈక్రమంలో అతడు భువనేశ్వర్ కుమార్ రికార్డును బ్రేక్ చేశాడు.
186 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ కుమార్ 41 సార్లు ప్రత్యర్థి బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బుమ్రా 141 మ్యాచ్‌ల్లోనే అతడి రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను అత్యధిక సార్లు క్లీన్‌బౌల్డ్ చేసిన ఘనత లసిత్ మలింగ్ పేరిట ఉంది. అతడు 63 సార్లు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత సునీల్ నరైన్, పీయూష్ చావ్లాలు ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు క్లీన్‌బౌల్డ్‌గా బ్యాటర్లను ఔట్ చేసిన బౌలర్లు వీరే..
లసిత్ మలింగ – 63
సునీల్ నరైన్ – 53
జస్‌ప్రీత్ బుమ్రా – 43
భువనేశ్వర్ కుమార్ – 41
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో విల్ జాక్స్ (53; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ (35; 24 బంతుల్లో 5 ఫోర్లు), కార్బిన్ బోష్ (27; 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సాయికిశోర్ రెండు వికెట్లు తీశాడు. సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ తలా ఓ వికెట్ తీశారు.
MI vs GT : వర్షం ఎక్కడ.. అంపైర్లపై ఆశిష్ నెహ్రా, రాహుల్ తెవాటియా ఆగ్రహం..
అనంతరం వర్షం వల్ల రెండోసారి ఆట నిలిచే సమయానికి లక్ష్య ఛేదనలో గుజరాత్ 18 ఓవర్లలో 132/6 స్కోరుతో నిలిచింది. వర్షం తగ్గిన తరువాత ఆటలో ఒక ఓవర్‌ను కుదించి గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్ణయించారు. దీంతో చివరి ఓవర్‌లో గుజరాత్ విజయసమీకరణం 15 పరుగులుగా మారింది. చాహర్ వేసిన ఈ ఓవర్‌లో టైటాన్స్ 15 పరుగులు చేసి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.