ధోనీ లేని క్రికెట్‍‌ను ఊహించలేం: ఐసీసీ

ధోనీ లేని క్రికెట్‍‌ను ఊహించలేం: ఐసీసీ

Updated On : February 11, 2019 / 10:44 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయింది. ధోనీని మోసేస్తూ వరుస ట్వీట్లతో మహీ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ధోనీ వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించిన ఐసీసీ.. తాజాగా అతనిపై చేసిన మరో ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎందుకంటే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20ధోనీ కెరీర్‌లో 300వది. 

భారత ప్లేయర్‌గా ఈ రికార్డు సృష్టించింది ధోనీనే. ప్రతి మ్యాచ్‌లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించే మహీ ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బ్యాట్‌తో విఫలమైనా.. మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ తర్వాత ఐసీసీ చేసిన ట్వీట్లు మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. 

వరల్డ్ ఫేమస్ బ్యాండ్ బీటిల్స్ కో ఫౌండర్, సింగర్ జాన్ లెనన్ పాడిన ఇమాజిన్ పాటను గుర్తు చేస్తూ ఐసీసీ వరుసగా ట్వీట్లు చేస్తూ వెళ్లింది. అంపైర్ లేని క్రికెట్‌ను ఊహించండి.. అన్ని మ్యాచ్‌లు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి అంటూ వరుస ట్వీట్ల రూపంలో లిరిక్స్  రాసింది. 

‘ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది.. మిమ్మల్ని స్టంప్ లేదా క్యాచ్ ఔట్ చేయడానికి ఎవరుంటారు. మీతో పరిహాసాలు ఆడటానికీ ఎవరూ ఉండరు’ అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.