Karun Nair : చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా ఆటగాడు కరుణ్ నాయర్ అరుదైన ఘనత సాధించాడు.

Karun Nair Breaks World Record Most List A Runs Without Getting Out
Karun Nair : టీమ్ఇండియా ఆటగాడు కరుణ్ నాయర్ అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్-ఏ (50 ఓవర్ల ఫార్మాట్‌లో) ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్న కరణ్ నాయర్ ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచులో శతకంతో చెలరేగాడు. 101 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 112 పరుగులు చేశాడు.
ఈ టోర్నీలో భీకర ఫామ్‌లో ఉన్న అతడు గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 112*, 44*, 163*, 111*, 112 పరుగులు చేశాడు. ఈ క్రమంలో లిస్ట్ ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా 542 పరుగులు సాధించి రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉంది. ఫ్రాంక్లిన్ వరుసగా 70*, 45*, 77*, 108*, 72*, 98*, 17*, 40 మొత్తం 527 పరుగులు చేశాడు.
ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
కరుణ్ నాయర్ – 542 పరుగులు
జేమ్స్ ఫ్రాంక్లిన్ – 527 పరుగులు
జాషువా వాన్ హీర్డే – 512 పరుగులు
ఫఖర్ జమాన్ – 455 పరుగులు
తౌఫీక్ ఉమర్ – 422 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం కరుణ్ నాయర్‌తో పాటు యశ్ (138) శతకం బాదడంతో లక్ష్యాన్ని విదర్భ 47.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
IND vs AUS 5th Test : బుమ్రాతో కొన్‌స్టాస్ వాగ్వాదం.. 2 బంతుల తరువాత.. నిరాశతో డగౌట్‌కు..
కరుణ్ నాయర్ తన అంతర్జాయ క్రికెట్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఇంగ్లాండ్‌పై అతడు త్రిపుల్ సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ తరువాత త్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అతడు చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2017లో ఆస్ట్రేలియాతో ఆడాడు. మొత్తంగా కరుణ్ నాయర్ టీమ్ఇండియా తరుపున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 62.3 సగటుతో 374 పరుగులు చేశాడు. రెండు వన్డేల్లో 23 సగటుతో 46 పరుగులు సాధించాడు.