Shubman Gill : చివరి బ్యాటర్ ఔట్ అయినప్పుడు ఏమనిపించింది.. గిల్‌కు బ్రిటన్ రాజు ప్రశ్న..
మంగళవారం లండన్‌లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు మర్యాదపూర్వకంగా బ్రిటన్ రాజు చార్లెస్-3ని కలిశారు.

King Charles III Meets Team India Mens and Womens Cricket Teams
లార్డ్స్ వేదికగా భారత్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఇక ఆఖరి వికెట్‌గా టీమ్ఇండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ అనూహ్యంగా ఔట్ అయ్యాడు. బంతిని డిఫెన్స్ ఆడగా.. ఆ బాల్ అతడి వెనుకగా వెళ్లి వికెట్లను పడగొట్టింది. ఈ ఘటనను సగటు భారత క్రీడాభిమాని ఇప్పట్లో మరిచిపోవడం కష్టమే.
కాగా.. ఇదే విషయాన్ని బ్రిటన్ రాజు చార్లెస్-3 ప్రస్తావించారు. చివరి బ్యాటర్ ఔట్ అయిన తరువాత మీకు ఏమని అనిపించింది అని టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ప్రశ్నించారు. మంగళవారం లండన్‌లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు మర్యాదపూర్వకంగా బ్రిటన్ రాజు చార్లెస్-3ని కలిశారు. ఈ సందర్భంగా గిల్‌ను ఆయన పై విధంగా ప్రశ్నించారు. దురదృష్టకరం.. సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తామని గిల్ సమాధానం ఇచ్చాడు.
ONE OF THE MOST HEARTBREAKING DEFEATS FOR INDIA. 💔 pic.twitter.com/0MF39tEHiD
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025
ఇక భేటీ అనంతరం గిల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు. కింగ్ చార్లెస్‌ను కలవడం ఎంతో బాగుందన్నాడు. ఎన్నో విషయాలను గురించి ఆయన మాట్లాడారని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా విశేష ఆదరణ ఉంటోందన్నాడు. విజయం కోసం తాము శాయశక్తులా కృషి చేస్తున్నామన్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లూ ప్రేక్షకులను అలరించాయని, టెస్టు మ్యాచ్ చివరి రోజు చివరి సెషన్‌లో ఒక జట్టు స్వల్ప తేడాతో మాత్రమే ఓడిందంటే.. ఆ మ్యాచ్‌లో క్రికెట్ గెలిచినట్లే అని గిల్ తెలిపాడు.
ఈ కార్యక్రమంలో ఇంగ్లాండ్‌లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి, డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు పాల్గొన్నారు.