KXIP vs SRH IPL 2020: హైదరాబాద్‌ని చుట్టేసిన పంజాబ్.. 12పరుగుల తేడాతో 4వ విజయం

KXIP vs SRH IPL 2020: ఐపీఎల్ టీ20లో దుబాయ్ వేదికగా హైదరాబాద్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్ రేసులోకి వచ్చేందుకు నువ్వా నేనా? అన్నట్లుగా తలపడ్డాయి. లీగ్ రెండో అర్ధభాగంలో దుమ్మురేపుతున్న పంజాబ్.. వరుసగా నాలుగో విజయం సాధించింది. 127 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను 114పరుగులకే చుట్టేసింది. దీంతో పంజాబ్ జట్టు 12పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది.
ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరి అయిపోగా.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే మిగిలాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లుతో 35పరుగులు చెయ్యగా.., విజయ్ శంకర్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లు సాయంతో 25పరుగులు చేశాడు. పంజాబ్‌లో నికోలస్ పూరన్ 28 బంతుల్లో రెండు ఫోర్లు సాయంతో 32పరుగులు చేశాడు.
127పరుగుల మినీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ చివరివరకు గెలిచే దిశలోనే ఉంది. రెండు పరుగుల వ్యవధిలో వార్నర్‌ను బిష్ణోయ్, బెయిర్‌స్టోను మురుగన్ అశ్విన్ పెవిలియన్ పంపించగా.. అబ్దుల్ సమద్ కూడా కేవలం 7పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. విజయ్ శంకర్, మనీశ్‌పాండే (15) కాసేపు నిలకడగా ఆడి నాలుగో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం అందించినా.. చివరకు గెలిపించలేకపోయారు.
జట్టు స్కోరు 100 వద్ద పాండేను జోర్డాన్, 110 వద్ద శంకర్‌ను అర్షదీప్ అవుట్ చేయడంతో హైదరాబాద్‌కు షాక్ తగిలింది. ఆ తర్వాత జాసన్ హోల్డర్ (5), రషీద్ ఖాన్ (0), సందీప్ శర్మ (0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. హైదరాబాద్ జట్టు 14 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోగా.. ఆఖరి ఓవర్లో 14 పరుగులు హైదరాబాద్‌కు అవసరం అనుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన అర్షదీప్ హైదరాబద్ జట్టును కట్టడి చేశాడు.
టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకుని పంజాబ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే కట్టుదిట్టంగా హైదరాబాద్ బౌలింగ్ వెయ్యడంతో పంజాబ్ పరుగులు చెయ్యడానికి కష్టపడింది. ఈ క్రమంలో 7వికెట్లు నష్టానికి నిర్ణీత 20ఓవర్లలో పంజాబ్ 126పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 127పరుగులుగా ఫిక్స్ అయ్యింది.
ఆరంభంలో దూకుడుగా ఆడిన పంజాబ్.. వరుసగా వికెట్లు పడడంతో ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో వికెట్ల మధ్య పరిగెత్తగానికి పరుగులు తియ్యడానికి కష్టపడుతుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన మయాంక్ స్థానంలో ఇవాళ ఓపెనర్‌గా మణిదీప్ సింగ్ ఎంట్రీ ఇవ్వగా.. 5వ ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రషీద్‌ఖాన్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. మన్‌దీప్ 14 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 17పరుగులు చేశాడు.
పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ నష్టానికి 47పరుగులు చేసిన పంజాబ్.. తర్వాత వికెట్ పడకుంగా 10ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడింది. అయితే సరిగ్గా 10వ ఓవర్ ఆఖరి బంతికి 11వ ఓవర్ ఫస్ట్ బంతికి క్రిస్ గేల్, రాహుల్ అవుట్ అయ్యి పెవిలియన్ చేరడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. పంజాబ్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ 2ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 20బంతుల్లో 20పరుగులు చేసి అవుటయ్యాడు. హోల్డర్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి వార్నర్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా.. రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్ తొలి బంతికి రాహుల్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27బంతుల్లో 27పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్, హుడా పెద్దగా స్కోరు చెయ్యలేదు. 13బంతుల్లో 12పరుగులు చేసి గ్లెన్ మ్యాక్స్‌వెల్ సందీప్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అవగా.. హుడా రెండు బంతులు ఆడి డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ జోర్డాన్ 12 బంతుల్లో 7పరుగులు, మురుగన్ అశ్విన్ 4 బంతుల్లో 4పరుగులు చేసి వరుసగా పెవిలియన్ చేరారు. చివరి వరకు అజేయంగా నిలిచిన నికోలస్ పూరన్ 28 బంతుల్లో 2ఫోర్లు సాయంతో 32పరుగులు చేశాడు.
బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై హైదరాబాద్ బౌలర్లు చెలరేగి ఆడారు. రషీద్, హోల్డర్, సందీప్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. మురుగన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు.