IPL 2025 : కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన కేఎల్ రాహుల్..! ఢిల్లీ కెప్టెన్ అతడే..!
ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇంత వరకు తమ సారథి ఎవరు అన్నది చెప్పలేదు.

KL Rahul Rejects Delhi Capitals Captaincy Offer Report
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. దాదాపుగా అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించగా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇంత వరకు తమ సారథి ఎవరు అన్నది చెప్పలేదు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు కేఎల్ రాహుల్ ఆ జట్టు కెప్టెన్సీ రేసులో ఉన్నట్లుగా మెగా వేలం తరువాత నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.
అక్షర్ పటేల్‌కు ఇంత వరకు పెద్దగా కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. అదే సమయంలో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ నాయకత్వం బాధ్యతలను నిర్వర్తించాడు. వీరిద్దరిలో ఎవరు ఢిల్లీ నాయకుడిగా ఉంటారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే.. తాజాగా కెప్టెన్సీ రేసు నుంచి కేఎల్ రాహుల్ తప్పుకున్నాడని, దీంతో ఐపీఎల్ 2025 సీజన్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నియమితుడు అయ్యేందుకు మార్గం సుగమం అయిందని అంటున్నారు.
‘అవును.. ఐపీఎల్ 2025 కి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌ను జట్టు కెప్టెన్‌గా ఉండమని కోరింది. కానీ అతడు మాత్రం ఓ బ్యాటర్‌గా జట్టుకు తోడ్పాడు అందించాలని కోరుకుంటున్నాడు.’ అని వర్గాలు మంగళవారం ఐఎఎన్‌ఎస్‌కు తెలిపాయి.
అక్షర్ పటేల్ 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు ఢిల్లీ అతడిని రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పటి వరకు అక్షర్ 150 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 130.88 స్రైక్‌రేటుతో 1653 పరుగులు చేశాడు. 7.28 ఎకానమీతో 123 వికెట్లు తీశాడు.
మరోవైపు రాహుల్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని ఢిల్లీ రూ.14కోట్లకు సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ 132 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 45.5 సగటు 134.6 స్ట్రైక్‌రేటుతో 4683 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు 37అర్థశతకాలు ఉన్నాయి.