విశాఖలో రోహిత్, రాహూల్ సెంచరీల మోత : ఇండియా 387/5

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 10:59 AM IST
విశాఖలో రోహిత్, రాహూల్ సెంచరీల మోత : ఇండియా 387/5

Updated On : December 18, 2019 / 10:59 AM IST

విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో రోహిత్ కు ఇది 28వ సెంచరీ. 2019లో ఏడు సెంచరీలు చేశాడు రోహిత్. దీంతో ఒకే ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ రికార్డ్ క్రియేట్ చేశాడు హిట్ మ్యాన్.

అటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 102 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. వన్డే కెరీర్ లో రాహుల్ కు ఇది 3వ సెంచరీ. వీరిద్దరూ దూకుడుగా ఆడి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 33.5 ఓవర్లలోనే భారత్ జట్టుకి 200 పరుగులు వచ్చాయి.

కాగా, సెంచరీ చేసిన వెంటనే కేఎల్ రాహుల్ ఔట్ అవడం అభిమానులను నిరాశపరిచింది. 227 పరుగుల దగ్గర భారత్ తన తొలి వికెట్ కోల్పోయింది. 104 బంతుల్లో 102 పరుగులు చేసి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. డకౌట్ అవడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. ఎదుర్కొన తొలి బంతికే విరాట్ ఔటయ్యాడు. పొలార్డ్ బౌలింగ్‌లో రోస్టన్ చేస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

చెన్నై వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 56 బంతులాడి 36 పరుగులకే ఔటైన రోహిత్ శర్మ.. వైజాగ్ వన్డేలోనూ ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించాడు. క్రీజులో కుదురుకున్నాక వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసఫ్ బౌలింగ్‌ని లక్ష్యం చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో స్పిన్నర్ ఛేజ్‌తో పాటు పేసర్ కాట్రెల్‌కి కూడా బాదుడు తప్పలేదు. ఆ తర్వాత వంతు పంత్, శ్రేయష్ అయ్యర్ ది. చివరి ఓవర్లలో పంత్,  ఆ తర్వాత అయ్యర్ సిక్సర్లతో విరుచుకుపడటంతో, రన్ రేట్ పరుగులెత్తింది.  ఇద్దరూ చెరో నాలుగు సిక్సర్లు బాదారు. 

తొలి వన్డేలో ఓటమి పాలైన కోహ్లి సేన.. రెండో వన్డేలో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ లో పోటీలో ఉంటారు. 3 వన్డేల సిరీస్ లో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది.