LSG : లక్నో జట్టులో మార్పులు తప్పవు..! తొలి వేటు అతడిపైనే..? పాపం ఒక్క ఏడాదికే..
రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ మంగళవారం (జూన్ 3)తో ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో బరిలోకి ఐపీఎల్ 18వ సీజన్‌లో అడుగుపెట్టిన జట్లలలో.. కొన్ని మంచి ప్రదర్శనలు చేయగా, మరికొన్ని అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ ముగిసి రెండు రోజులు కూడా పూర్తి కాకముందే ఐపీఎల్ 2026 సీజన్ పై దృష్టి సారించాయి పలు ఫ్రాంఛైజీలు.
ఈ క్రమంలో పలువురు ఆటగాళ్లు, కోచింగ్ సాఫ్ట్‌లలోని కొందరిని సాగనంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ అందరి కంటే ముందు ఉన్నట్లుగా తెలుస్తోంది.
రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. లక్నో ప్రదర్శన పై ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
కోచ్, మెంటార్ పై వేటు..
ఈ క్రమంలో జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, మెంటార్ జహీర్ ఖాన్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దలో జహీర్ ఖాన్ ఓ సంవత్సరకాల ఒప్పందంతోనే ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జట్టులో చేరాడు. ఈ సీజన్‌లో లక్నో పేలవ ప్రదర్శనతో అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించడం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
క్రిక్‌బజ్ ప్రకారం.. మెంటర్ జహీర్ ఖాన్ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం లేనట్లు పేర్కొంది. లక్నోశిబిరంలో ఏదో సమస్య ఉన్నట్లుగా తెలిపింది. గౌతమ్ గంభీర్ వెళ్లిపోయినప్పటి నుండి ఫ్రాంచైజీతో ఉన్న ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కంటే జహీర్ ఎక్కువ గా దాని భారాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని భావిస్తున్నారు.
పంత్, జహీర్ లు నిర్భయమైన క్రికెట్ బ్రాండ్ ఆడటం గురించి మాట్లాడారు. కానీ వారు జట్టుగా మైదానంలో దానిని ప్రతిబింబించడంలో విఫలమయ్యారు. అటు కోచ్ జస్టిన్ లాంగర్ పైనా వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పంత్ కష్టపడుతున్నాడు..
ఐపీఎల్ 2025 సీజన్‌లో రిషబ్ పంత్ పేలవ ఫామ్‌తో సతమతం అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రమే అతడు బాగా ఆడాడు. శతకంతో చెలరేగాడు. అయినప్పటికి ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది. మొత్తంగా ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో పంత్ 24.45 సగటు, 133.16 స్ట్రైక్‌రేటుతో 269 పరుగులు చేశాడు. లక్నో తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఐదో స్థానంలో నిలిచాడు.