IPL 2024 : హార్దిక్ ఎంత పనిచేశావ్..! చివరి ఓవర్ నువ్వెందుకేశావయ్యా.. ముంబై ఫ్యాన్స్ ఆగ్రహం

మహేంద్ర సింగ్ ధోనీ తుఫాన్ బ్యాటింగ్ తో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 200 దాటదనుకున్న స్కోర్ ఏకంగా 206 పరుగులకు వెళ్లింది. ధోనీ సిక్సర్ల మోత మోగిస్తుండగా ..

IPL 2024 : హార్దిక్ ఎంత పనిచేశావ్..! చివరి ఓవర్ నువ్వెందుకేశావయ్యా.. ముంబై ఫ్యాన్స్ ఆగ్రహం

Hardik Pandya

Updated On : April 15, 2024 / 8:10 AM IST

CSK vs MI IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 20పరుగుల తేడాతో సీఎస్కే జట్టు విజయం సాధించింది. అయితే, సీఎస్కే జట్టు విజయానికి హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వేయడమే కారణమని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69), శివమ్ దూబె (66 నాటౌట్) దూడుకుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, 200 పరుగులు చేరడం కష్టమని సీఎస్కే ఫ్యాన్స్ సైతం భావించారు. కానీ, ధోనీ సిక్సర్ల మోత మోగించడంతో సీఎస్కే జట్టు 206 పరుగులు చేయగలిగింది.

Also Read : IPL 2024 : ఒక చేతిలో ప్యాంటు.. మరో చేతిలో బంతి.. రోహిత్ శర్మ ఫన్నీ వీడియో వైరల్

19వ ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్కోర్ 180కి చేరింది. క్రీజులో దూబె, మిచెల్ ఉన్నారు. చివరి ఓవర్ ను ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేశాడు. రెండో బంతికి మిచెల్ ను ఔట్ చేశాడు. మిచెల్ ఔట్ కావడంతో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చారు. ధోనీ గ్రౌండ్ లోకి బ్యాట్ తో అడుగు పెడుతున్న క్రమంలో ధోనీ ధోనీ అంటూ అభిమానుల నినాదాలతో వాంఖడే స్టేడియం మార్మోగిపోయింది. ధోనీ వచ్చీరావడంతో తొలి బంతిని సిక్స్ కొట్టాడు.. రెండో బంతిని కూడా బౌండరీ లైన్ బయటకు తరలించాడు.. మూడో బంతిని కూడా సిక్స్ కొట్టాడు.. చివరి బంతికి బౌండరీ కొట్టే ప్రయత్నంలో రెండు పరుగులు వచ్చాయి. దీంతో హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో కేవలం నాలుగు బంతుల్లోనే ధోనీ 20 పరుగులు రాబట్టాడు. ఆ పరుగులే సీఎస్కే విజయానికి దోహదపడ్డాయి.

Also Read : IPL 2024 : రుతురాజ్, దూబె విజృంభణ.. ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నై విజయం!

మహేంద్ర సింగ్ ధోనీ తుఫాన్ బ్యాటింగ్ తో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 200 దాటదనుకున్న స్కోర్ ఏకంగా 206 పరుగులకు వెళ్లింది. ధోనీ సిక్సర్ల మోత మోగిస్తుండగా వాంఖడే స్టేడియం ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది. ఒకవేళ ధోనీ చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది ఉండకపోతే ముంబై ఇండియన్స్ జట్టు గెలిచే అవకాశాలు ఉండేవన్న వాదనను పలువురు వ్యక్తపర్చారు. ఎందుకంటే.. ధోనీ చివరి నాలుగు బాల్స్ కు కొట్టిన పరుగులు 20.. ముంబై జట్టు కూడా 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనికితోడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లోనూ విఫలమయ్యాడు. గత రెండు మ్యాచ్ లలో ముంబై వరుసగా విజయాలు సాధించడంతో హార్దిక్ ను ఎగతాళి చేయడం మానుకుంటారేమో అనిపించింది. కానీ, ఈ మ్యాచ్ లో హార్దిక్ కెప్టెన్సీ, బౌలింగ్, బ్యాటింగ్ లోనూ విఫలం కావడంతో ప్రేక్షకులు మరోసారి హార్దిక్ ను ఎగతాళి చేస్తున్నారు.