LSG vs MI : ఆఖరి పోరులో ముంబైపై 18 పరుగుల తేడాతో లక్నో విజయం..!

IPL 2024 : LSG vs MI : ఆఖరి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 215 లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది.

LSG vs MI : ఆఖరి పోరులో ముంబైపై 18 పరుగుల తేడాతో లక్నో విజయం..!

LSG Beat MI by 18 Runs ( Image Credit : @IPL_Twitter/ Google )

Updated On : May 18, 2024 / 12:55 AM IST

IPL 2024 – LSG vs MI : ఐపీఎల్ 2024లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 215 లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది. చివరి లీగ్ మ్యాచ్‌లో కూడా ముంబై పోరాడి ఓడింది. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రెండో ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ఆరంభంలోనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 3.5 ఓవర్లలో 33/0 వద్ద ముంబైకి వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, మ్యాచ్ పునఃప్రారంభమైన తర్వాత శర్మ లక్నో బౌలర్లను ధాటిగానే ఎదుర్కొన్నాడు. రోహిత్ దూకుడుగా ఆడటంతో ఆరు ఓవర్ల తర్వాత పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబై 53/0 స్కోరుచేసింది. అప్పటికే, హిట్ మ్యాన్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రోహిత్ శర్మ, ధీర్ హాఫ్ సెంచరీలు :
ఆ తర్వాత బ్రీవిస్ 23 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఆ వెంటనే  సూర్యకుమార్ యాదవ్ (0) కృనాల్ పాండ్యా చేతిలో డకౌట్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ 92/2తో నిలిచింది. 68 పరుగుల వద్ద రోహిత్ శర్మ నిష్క్రమించాడు. లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఎంఐ చేజింగ్‌లో తడబడింది. హార్దిక్ పాండ్య 16 పరుగులు తర్వాత మొహ్సిన్ వేసిన బౌన్సర్‌కు చేతులేత్తేశాడు.

వధెరా కేవలం ఒక పరుగుతో నిష్క్రమించగా బిష్ణోయ్‌కు మరో వికెట్‌ దక్కింది. నమన్ ధీర్ (62; 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ ) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. చివరికి, ఉత్కంఠభరితమైన పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ముంబై 196 పరుగులకే పరాజయం పాలైంది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ తలో 2 వికెట్లు తీయగా, మొహ్సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.

చెలరేగిన కేఎల్ రాహుల్, నికోలస్ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌‌కు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (55; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్), నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. మార్కస్ స్టోయినిస్ (28), ఆయూష్ బదోని (22), దీపక్ హుడా (11), కృనాల్ పాండ్యా (12) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో నువాన్ తుషార, పీయూష్ చావ్లా తలో 3 వికెట్లు పడగొట్టారు. లక్నో ప్లేయర్ నికోలస్ పూరన్ (75)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

లీగ్ దశ ముగింపు.. లక్నో 7 .. ముంబై 4 గెలుపు.. :
పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచి 7 ఓడి 14 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 10 ఓడి 8 పాయింట్లతో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. మొత్తానికి ఇరుజట్లు లీగ్ దశ ముగించుకున్నాయి.

Read Also : Team India Head Coach : ద్ర‌విడ్ త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..?