Pat Cummins : రోహిత్, కోహ్లీలను చూసేందుకు ఇదే చివరి అవకాశం కావొచ్చు.. పాట్ కమిన్స్ కామెంట్స్..
ఆస్ట్రేలియా అభిమానులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటను చూసేందుకు ఇదే చివరి అవకాశం కావొచ్చునని పాట్ కమిన్స్ (Pat Cummins) అన్నాడు.

Might be the last chance for Australian public to see Rohit and Kohli says Pat Cummins
Pat Cummins : అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా అభిమానులకు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటను చూసేందుకు ఇదే చివరి అవకాశం కావొచ్చునని అన్నాడు. వెన్నునొప్పి కారణంగా 32 ఏళ్ల కమిన్స్ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు.
టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు వీరిద్దరు ఎంపిక అయ్యారు. ఆసీస్‌తో సిరీస్ తరువాత ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారు అనే వార్తలు వస్తున్న క్రమంలో కమిన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గత 15 సంవత్సరాలుగా భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో భాగం అయ్యారు. ఆస్ట్రేలియా గడ్డపై వారి ఆటను చూసేందుకు ఇక్కడి అభిమానులకు ఇదే చివరి అవకాశం కావొచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్ తరుపున ఆటలో ఛాంపియన్లుగా నిలిచారు. ఎల్లప్పుడూ జట్టుకు ఎంతో మద్దతు ఇచ్చారు. ‘అని కమిన్స్ అన్నాడు.
ఇక తాము వారితో ఆడినప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తుందన్నాడు. భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు దూరం కావడం పట్ల బాధను వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తారని భావిస్తున్నట్లు చెప్పాడు.
మిచెల్ మార్ష్‌కు సూచనలు..
కమిన్స్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ క్రమంలో మార్ష్‌కు కమిన్స్ పలు సూచనలు చేశాడు. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచేందుకు ప్రయత్నించాలన్నాడు. అదే సమయంలో కుర్రాళ్లకు జట్టులో చోటు ఇవ్వాలన్నాడు. ముఖ్యంగా గత ప్రపంచకప్‌లో చోటు దక్కని వారికి చోటు ఇవ్వాలన్నాడు.
Womens World Cup 2025 : ఆసీస్ చేతిలో ఓటమి.. టీమ్ఇండియాకు ఐసీసీ భారీ జరిమానా..
వన్డే ప్రపంచకప్ 2027 కన్నా ఓ సంవత్సరం ముందుగానే.. ఈ మెగాటోర్నీలో ఆడే ఆసీస్ జట్టులో ఉండే 15 మంది ఆటగాళ్లు ఎవరో అన్న దానిపై స్పష్టత రావాలన్నాడు. అందుకు భారత్‌తో సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని సూచించాడు.