Moeen Ali : నా తల్లిదండ్రులు పాక్ఆక్రమిత కశ్మీర్‌లోనే ఉన్నారు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎంతో భయపడ్డా..
లీగ్‌లో ఆడేందుకు భారత్‌కు రాని అతికొద్ది మంది అంతర్జాతీయ క్రికెటర్లలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఒకడు.

Courtesy BCCI
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా తొమ్మిది రోజుల పాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 శనివారం (మే 17న) పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లీగ్‌లో ఆడేందుకు భారత్‌కు రాని అతికొద్ది మంది అంతర్జాతీయ క్రికెటర్లలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఒకడు. కాగా.. ఆపరేషన్ సింధూర్ సమయంలో తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నట్లు మొయిన్ అలీ చెప్పాడు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులకు పాల్పడింది. దీనికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు మొయిన్ అలీ ఆ రోజును గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఎంతో ఆందోళన చెందినట్లు తెలిపాడు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో తన తల్లిదండ్రులు పీఓకేలో ఉన్నట్లు మొయిన్ చెప్పాడు. వారున్న చోటు నుంచి గంట ప్రయాణ దూరంలోనే దాడులు జరిగాయని తెలిపాడు. అయితే అదృష్టవశాత్తు తన తల్లిదండ్రులు ఉన్న ప్రాంతంలో ఎలాంటి క్షిపణి దాడులు జరగలేదన్నాడు. వెంటనే వారు అందుబాటులో ఉన్న విమానం ఎక్కి ఆ ప్రాంతాన్ని వీడారు. వారు క్షేమంగా రావడంతో ఊపిరి పీల్చుకున్నట్లు గా మొయిన్ చెప్పాడు.
మొయిన్ అలీ పూర్వీకులు ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న మీర్పూర్ ప్రాంతానికి చెందిన వారు. కాగా.. అతడి తాత చిన్నతనంలోనే ఇంగ్లాండ్ కు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. బర్మింగ్ హమ్‌లో మొయిన్ అలీ పుట్టాడు.