Mohammed Shami: టీమిండియా మాజీ క్రికెటర్ పై మహ్మద్ షమీ తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే?

ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా బీసీసీఐ ఈ వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

Mohammed Shami: టీమిండియా మాజీ క్రికెటర్ పై మహ్మద్ షమీ తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే?

Mohammed Shami

Updated On : November 21, 2024 / 11:53 AM IST

Mohammed Shami : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజ్రేకర్ తన గురించి చేసిన వ్యాఖ్యలకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా షమీ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తే.. ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా బీసీసీఐ ఈ వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో భారీ మొత్తం వెచ్చించి ఫ్రాంచైజీలు ఏ క్రికెటర్ ను తమ జట్టులోకి తీసుకుంటాయనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ లో మంజ్రేకర్ మాట్లాడుతూ.. మహ్మద్ షమీని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

 

మంజ్రేకర్ మాట్లాడుతూ..
ఐపీఎల్ మెగా వేలంలో టీంలు ఎలాంటి ప్లేయర్లను తీసుకుంటాయనేది చూడాలి. టీమిండియా ఆటగాళ్లకు ఎక్కువ మొత్తంలో వెచ్చించే అవకాశం ఉంది. అయితే, సీనియర్ పేసర్ షమీ గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు. షమీ ఇటీవలే దేశవాళీ క్రికెట్ కు తిరిగి వచ్చినప్పటికీ అతని ఫిట్ నెస్ పరిశీలనలో ఉంది. వేలంలో ఏ జట్టు యాజమాన్యమైనా షమీని దక్కించుకోవాలంటే ముందుగా అతని గాయం గురించి తొలుత చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతని గాయం కారణంగా సంవత్సరం పాటు క్రికెట్ దూరంగా ఉన్నాడు.. ప్రస్తుతం దేశవాళి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో అతను గాయం నుంచి కోలుకున్నట్లు నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలో ఒకవేళ షమీని భారీ మొత్తంలో వెచ్చించి తీసుకున్నా.. గాయం తిరగబడి అతను సీజన్ మధ్యలో టోర్నీకి దూరమైతే జట్టుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఈసారి వేలంలో మహ్మద్ షమీకి తక్కువ ధర పలుకుతుందని అనిపిస్తోందని మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

మహ్మద్ షమీ కౌంటర్..
మంజ్రేకర్ వ్యాఖ్యలకు మహ్మద్ షమీ తీవ్రంగా స్పందించారు. ‘మీ భవిష్యత్తు కోసం జ్ఞానం ఉంచుకోండి మంజ్రేకర్ జీ. అది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది’ అని ఇన్ స్టాగ్రామ్ లో షమీ పోస్టు పెట్టాడు. షమీ పోస్టుకు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.

Mohammed Shami