ఆ నలుగురూ : అర్జున అవార్డు ఎంపిక లిస్ట్ లో క్రికెటర్లు

ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత క్రికెట్ జట్టు నుంచి నలుగురిని ప్రతిపాదించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్‌లను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫారసు చేస్తూ లేఖను రాసింది. క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సాబా కరీమ్ ఈ నలుగురి పేర్లను ప్రతిపాదించగా, వినోద్ రాయ్, డయానా ఎడుల్జి, లెఫ్టినెంట్ జనరల్ రవి తోడ్గేలతో కూడిన పాలకవర్గం అభ్యర్ధుల ప్రతిపాదనను ఆమోదించింది.
భారత్ జట్టులోకి 2016లో అడుగుపెట్టిన జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నారు. అలాగే 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన మహ్మద్ షమీ.. భారత క్రికెట్ జట్టులో తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు క్రియాశీలకంగా ఉన్నాడు. జడేజా కూడా తన స్పిన్నింగ్ పటిమతోనూ, బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టుకు లెగ్ స్పిన్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పూనమ్ యాదవ్‌కి కూడా ఈసారి చోటు దక్కింది గతంలో 2018లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధానాకి ‘అర్జున’ అవార్డు దక్కింది.