చాహల్‌ను చూసి డ్రెస్సింగ్ రూమ్‌కు పారిపోయిన ధోనీ

చాహల్‌ను చూసి డ్రెస్సింగ్ రూమ్‌కు పారిపోయిన ధోనీ

Updated On : February 5, 2019 / 4:31 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ పరుగులో వేగం అందరకీ తెలిసిందే. కానీ, ఆ పరుగును పారిపోవడానికి ఉపయోగిస్తే అతణ్ని పట్టుకోవడం ఎవరితరం అవుతుంది. గంటకు వందల కి.మీల వేగంతో బౌలింగ్ చేసే చాహల్ తరం కూడా కాలేదు. అసలు ధోనీ.. చాహల్ నుంచి పారిపోవడానికి కారణం ఏంటి? ఈ సమాధానం కోసం నెట్టింట్లో ప్రశ్నల వెల్లువ మొదలైంది. కివీస్‌తో ఆఖరి వన్డే విజయం అనంతరం సిరీస్ కైవసం చేసుకున్న ఆనందంలో టీమిండియా క్రికెటర్లంతా మీడియాతో మాట్లాడుతున్నారు. ట్రోఫీ పట్టుకుని విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్ లాంటి వాళ్లు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. 

వాళ్ల వెనుక నుంచి ధోనీ దూసుకుంటూ వెళ్లిపోయాడు. వెంబడిస్తూ అలసిపోయిన చాహల్ ఆగిపోయాడు. చాహల్‌కు చిక్కకుండా డ్రెస్సింగ్‌ రూం వైపు వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల ఈ మధ్యే యుజువేంద్ర చాహల్‌ ఒక ఛాట్‌ షో ప్రారంభించాడు. ‘చాహల్‌ టీవీ’ పేరుతో దాన్ని ప్రచారం చేస్తున్నాడు. టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సరదాగా సాగే ఈ సంభాషణలో ధోనీ పాల్గొనేందుకు ఆసక్తి కనబరచలేదు.

 

టీమిండియా కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌ వెల్లింగ్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం జరగనుంది.