IND vs ENG : ముకేశ్ అంబానీనే నిలబెట్టిన అభిషేక్ శర్మ.. ఓర్నీ చిచ్చర పిడుగా.. వీడియో వైరల్
ముంబైలో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు.

Mukesh Ambani reaction goes viral as Abhishek Sharma smashes record breaking hundred
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటూ తెలుగులో ఓ సినిమాలో పాట ఉంటుంది. ఆదివారం ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అలాంటి ఇన్నింగ్స్‌ను ఆడాడు. బంతి పడడమే ఆలస్యం బౌండరీ లక్ష్యంగా అతడి బ్యాటింగ్ సాగింది. అతడి మెరుపులతో మైదానం దద్దరిల్లిపోయింది. 37 బంతుల్లోనే 270.3 స్ట్రైక్ రేట్ తో మెరుపు శతకం బాదాడు. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 13 సిక్స్ లు బాది 135 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో అభిషేక్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదండోయ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రెండో వేగవతంమైన అర్థశతకం బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేసి..టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు.
ఓ వైపు అభిషేక్ శర్మ దంచికొడుతుంటే మరో వైపు స్టేడియం కేరింతలు, చప్పట్లు, ఈలలు, గోలలతో హోరెత్తిపోయింది. ముంబైలో మ్యాచ్ జరగడంతో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆమిర్ ఖాన్లతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, రిషి సునాక్, నారాయణ మూర్తి, రాజీవ్ శుక్లా వంటి ప్రముఖులు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. వీరంతా అభిషేక్ బ్యాటింగ్ ను ఆస్వాదించారు.
అభిషేక్ దంచికొడుతుంటే ముకేశ్ అంబానీ లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అభిషేక్‌ను అభినందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. అభిషేక్‌ను అంబానీ ఎత్తుకుపోతాడు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున అభిషేక్‌ను ఆడించేందుకు ప్రయత్నిస్తాడని అంటున్నారు.
అభిషేక్ దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె తలా రెండు వికెట్లు పడగొట్టాడు. రవిబిష్ణోయ్ ఓ వికెట్ సాధించాడు.
ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అభిషేక్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచారు.