Abhishek Sharma – Nitish Reddy : ముంబైలో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్.. నితీశ్ రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఏంటి భయ్యా అంత మాట అనేశావ్..
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Nitish Reddy insta story viral about Abhishek sharma batting in 5th 20match against england
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ముంబైలో పెను విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించాడు. అతడి బ్యాటింగ్‌కు వాంఖడే స్టేడియం మొత్తం ఊగిపోయింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ఎంత తప్పో అతడికి తొందరగానే తెలిసి వచ్చింది. బంతి పడడమే ఆలస్యం బౌండరీ లక్ష్యంగా అభిషేక్ బ్యాటింగ్ సాగింది. అతడు సిక్సర్లు కొట్టడం చూస్తుంటే ఇంత సులువుగా సిక్సర్లు కొడతారా అన్నట్లుగా అనిపించింది. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తరువాత కాస్త నెమ్మదించినా ఆఖర్లో మరోసారి మెరుపులు మెరిపించాడు.
IND vs ENG : అభిషేక్ శర్మ ఆల్‌రౌండ్ షో.. ఐదో టీ20లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం
ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఇక పాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగానూ నిలిచాడు.
కాగా.. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ శర్మ గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మెంటల్ నా కొడుకు అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) శతకంతో పాటు శివమ్ దూబె (30; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు తీశాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జేమి ఓవర్టన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ (55; 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫిలిప్స్ కాకుండా జాకబ్ బెథెల్ (10) ఒక్కడే రెండు అంకెల స్కోరు అందుకున్నాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె, అభిషేక్ శర్మ లు తలా రెండు వికెట్లు తీశారు. రవిబిష్ణోయ్ ఓ వికెట్ సాధించాడు.