WPL 2025 : బెంగళూరు కొంపముంచిన కనిక.. వరుస విజయాలకు బ్రేక్.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ..
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ వరుస విజయాలకు బ్రేక్ పడింది.

Mumbai Indians Women won by 4 wickets against Royal Challengers Bengaluru Women in WPL 2025
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోష్‌కు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆర్‌సీబీకి ముంబై షాకిచ్చింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఎల్లిస్ పెర్రీ( 81; 43 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేసింది. రిచా ఘోష్(28), స్మృతి మంధాన(26) లు పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు తీసింది. షబ్నిమ్ ఇస్మాయిల్, నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, సంస్కృతి గుప్తాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
IND vs PAK : పాకిస్తాన్‌తో మ్యాచ్.. వరల్డ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్(50; 38 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ బాదగా.. నాట్ సీవర్ బ్రంట్( 42; 21 బంతుల్లో 9 ఫోర్లు), అమన్‌జోత్ కౌర్(34 నాటౌట్; 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో లక్ష్యాన్ని ముంబై 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో జార్జియా వేర్‌హామ్ మూడు వికెట్లు తీయగా, కిమ్ గార్త్ రెండు వికెట్లు పడగొట్టింది.
కొంపముంచిన కనిక..
ముంబై విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో అమన్‌జోత్ కౌర్, జి.కమలిని లు ఉన్నారు. అప్పటికి అమన్ జోత్ కౌర్ 22 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆర్‌సీబీదే విజయం అని అంతా అనుకున్నారు. అయితే.. 19 ఓవర్‌ను కనిక వేసింది. తొలి బంతికే అమన్‌జోత్ కౌర్ సిక్సర్ బాదింది. రెండో బంతి డాట్ కాగా.. మూడో బంతికి సింగిల్ వచ్చింది. నాలుగో బంతికి కమలిని రెండు పరుగులు తీసింది. ఐదో బంతికి బంతికి సింగిల్ రాగా.. ఆరో బంతిని అమన్‌జోత్ కౌర్ సిక్సర్‌గా మలిచింది. దీంతో 19 ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ముంబై విజయ సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులుగా మారింది.
ఆఖరి ఓవర్‌ను ఎక్తా బిస్త్ వేసింది. తొలి నాలుగు బంతులకు కట్టుదిట్టంగా వేసి నాలుగు పరుగులే ఇచ్చింది. అయితే.. ఐదో బంతిని కమలిని బౌండరీకి తరలించడంతో ముంబై గెలిచింది.
కాగా.. 19 ఓవర్‌లో కనిక కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే ఆర్‌సీబీ వరుసగా మూడో విజయాన్ని సాధించి ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మ్యాచ్‌లో కనిక రెండు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చింది. ఒక్క వికెట్ కూడా తీయలేదు.