బౌల్ట్ బౌలింగ్ మాయాజాలం : టీమిండియా 92 ఆలౌట్

హామిల్టన్ : టీమిండియా ఎప్పటి లేని ఘోరమైన ఆట తీరును కనబరిచింది. బ్యాట్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. జట్టులో ఉన్న ఏ ఒక్క క్రీడాకారుడు బ్యాట్‌కి పని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సిరీస్‌ని దక్కించుకున్నారు..కదా..ఆడితే ఏముందిలే..అన్న రీతిలో ఆట ఆడారు. న్యూజిలాండ్ టూర్‌లో భాగంగా మూడు వన్డేలో విజయం సాధించి వన్డే సిరీస్‌ని ఇండియా దక్కించుకుని నాలుగో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటతీరును చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు. అసలు టీమిండియా ఆడుతోందా ? అని అనుకున్నారు అంతా. ఓపెనర్ల నుండి చివరి లాస్ట్ బ్యాట్స్ మెన్ వరకు ఏ ఒక్కరూ సరిగ్గా ఆడలేదు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, గ్రాండ్ హోమ్ ధాటికి భారత్ నిర్ణీత 50 ఓవర్లు ఆడకుండానే కుప్పకూలిపోయింది. 30.5 ఓవర్లలోనే 92 పరుగులకే చేతులేత్తిసింది.
జనవరి 31వ తేదీ గురువారం నాలుగో వన్డే స్టార్ట్ అయ్యింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రాండ్ హోమ్, బౌల్ట్‌లు చుక్కలు చూపించారు. వీరి బౌలింగ్ ధాటికి భారత శిబిరం పేకమేడలా కూలిపోయింది. ధావన్ (13), పాండ్యా (16), కుల్ దీప్ యాదవ్ (15), చాహల్ (18) రన్లను సాధించగా మిగతా బ్యాట్స్ మెన్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 55 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. కనీసం వంద మార్కును చేరుతుందా ? అని అందరూ అనుకున్నారు. అన్నట్లే అయ్యింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌల్ట్ 5 వికెట్లు తీయగా, గ్రాండ్ హోమ్ 3 వికెట్లు తీశారు.