Parvez Rasool : రిటైర్‌మెంట్ ప్రకటించిన 36 ఏళ్ల టీమ్ఇండియా ఆల్‌రౌండర్..
క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు పర్వేజ్ రసూల్ (Parvez Rasool ) రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

Parvez Rasool announces retirement from all formats of cricket
Parvez Rasool : జమ్మూ అండ్ కశ్మీర్ నుంచి టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన పర్వేజ్ రసూల్(Parvez Rasool) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ సోమవారం క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇక పై కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పాడు. ఇప్పటికే అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో లెవల్-2 కోచింగ్ సర్టిఫికేట్ పూర్తి చేశాడు.
టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన అత్యున్నత గౌరవం అని పర్వేజ్ రసూల్ చెప్పాడు. తన క్రికెట్ ప్రయాణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. తన ప్రయాణంలో మద్దతు ఇచ్చిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశాడు. తాను మైదానంలో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించినట్లు చెప్పుకొచ్చాడు.
Sarfaraz Khan : ఏం తప్పు చేశాడని.. సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు ఇవ్వలేదు..
పర్వేజ్ రసూల్ భారత్ తరపున 2014లో ఓ వన్డే మ్యాచ్, 2017లో ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆడిన ఒక్క వన్డేలో రెండు వికెట్లు తీశాడు. ఆడిన ఒక్క టీ20 మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం పర్వేజ్ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. 155 ఇన్నింగ్స్‌ల్లో 5648 పరుగులు చేయడంతో పాటు 352 వికెట్లు తీశాడు. ఇక రంజీట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా రెండు సార్లు లాలా అమర్‌నాథ్ అవార్డును గెలుచుకున్నాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2013 నుంచి 2016 మధ్య 11 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు సాధించాడు.