Musharraf: ముషార్రఫ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ దక్కించుకున్న భారత క్రికెటర్ ఎవరో తెలుసా!

Pervez Musharraf, Team India
Pervez Musharraf: భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) 2004 పాకిస్థాన్ లో పర్యటించినప్పుడు టీమిండియా క్రికెటర్ ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తోపాటు, పాక్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడెవరో కాదు.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ (Lakshmipathy Balaji). క్రికెట్ ప్రేమికులకు అతడు గుర్తుండే ఉంటాడు. 2004లో పాక్ పర్యటన నాటి జ్ఞాపకాలను టీమిండియా (Team India) అప్పటి మీడియా మేనేజర్ అమృత్ మాథుర్ (Amrit Mathur) తాను రాసిన “పిచ్‌సైడ్: మై లైఫ్ ఇన్ క్రికెట్”లో పుస్తకంలో పొందుపరిచారు.
పాకిస్థాన్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ సభ్యులు పర్వేజ్ ముషార్రఫ్ ను మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా లక్ష్మీపతి బాలాజీని ప్రశంసించారట. ”ముందుగా టీమిండియా మెంబర్స్.. తమను తాము పరిచయం చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తో ముషార్రఫ్ సుదీర్ఘ కరచాలనం చేశారు. తర్వాత బీసీసీఐ మెమొంటోస్, భారత ఆటగాళ్లు సంతకాలు చేసిన క్రికెట్ బ్యాట్ ను ఆయనకు బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తో పాటు స్టన్నింగ్ క్యాచ్ తో షోయబ్ మాలిక్ ను అవుట్ చేసిన మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) ను ముషార్రఫ్ మెచ్చుకున్నారు.
ముషార్రఫ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ మాత్రం లక్ష్మీపతి బాలాజీకే దక్కింది. టీమిండియా ఓడిపోయిన మ్యాచ్ లోనూ బాలాజీ ప్రదర్శించిన పోరాట పటిమను ఎంతోగానో కొనియాడారు. తన జట్టు కోసం ధైర్యంగా సైనికుడిలా పోరాడాడని మెచ్చుకున్నారు. ఎటువంటి నాటకీయత లేకుండా జట్టు కోసం పోరాడిన అతడి పోరాట స్ఫూర్తికి ముషార్రఫ్ సెల్యూట్ చేశార”ని అమృత్ మాథుర్ తన పుస్తకంలో రాశారు. వాఘా సరిహద్దును సందర్శించినప్పుడు, లాహోర్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో ముచ్చటించినప్పుడు కూడా లక్ష్మీపతి బాలాజీకి మంచి గుర్తింపు దక్కిందని గుర్తు చేసుకున్నారు.
Also Read: వన్డే ప్రపంచకప్ ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు..
2004 పాకిస్థాన్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు ఐదు వన్డేలు, మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. వన్డే సిరీస్ ను 3- 2తో టెస్ట్ సిరీస్ ను 2- 1తో గెల్చుకుంది. రావల్పిండిలో జరిగిన రెండో వన్డేలో 12 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో ముషారఫ్ ఇరు జట్లకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ముచ్చట్లను అమృత్ మాథుర్ తన పుస్తకంలో పొందుపరిచారు. అయితే పాకిస్థాన్ లో తనకు వచ్చిన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. చెన్నైలో ఎవరూ తనను పెద్దగా గుర్తుపట్టరని వ్యాఖ్యానించాడట బాలాజీ.
Also Read: బంతీలేదు, బ్యాటు లేకుండా క్రికెట్.. ఈ పెద్దాయనకు సిక్సర్ మించి స్కోర్ ఇవ్వాల్సిందే..
రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన లక్ష్మీపతి బాలాజీ.. 2002, నవంబర్ 18న తొలి వన్డే ఆడాడు. 2003, అక్టోబర్ 8న టెస్టులో అరంగ్రేటం చేశాడు. 30 వన్డేలు, 8 టెస్టులు, 5 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 73 మ్యాచ్ లు ఆడాడు. ఆట నుంచి తప్పుకున్న తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. మిస్ చెన్నై అందాల పోటీదారు ప్రియా తాలూర్‌ని 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు (అరన్ బాలాజీ) ఉన్నాడు.