Pro Panja League 2023: రన్నరప్‌గా కిరాక్ హైదరాబాద్.. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్ హైదరాబాద్ 28-30 తేడాతో కొచి కెడిస్ చేతిలో పోరాడి ఓడిపోయింది.
Kirak Hyderabad Team: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) మొదటి సీజన్లో తెలుగు రాష్రాల జట్టు కిరాక్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. లీగ్ దశతో పాటు సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన హైదరాబాద్ జట్టు ఫైనల్లో టై బ్రేకర్‌లో పట్టు విడిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్ హైదరాబాద్ 28-30 తేడాతో కొచి కెడిస్ చేతిలో పోరాడి ఓడిపోయింది. అండర్ కార్డు, మెయిన్ కార్డు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లూ సమంగా నిలిచాయి. టై బ్రేకర్ లో సత్తా చాటిన కొచ్చి తొలి సీజన్ ట్రోఫీ సొంతం చేసుకుంది. సీజన్లో అద్భుతంగా పోరాడి రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమానికి నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్ రెడ్డి అభినందించారు.
హోరాహోరీగా అండర్ కార్డ్ మ్యాచ్‌లు ..
అండర్ కార్డు మ్యాచ్‌లు హోరీహోరీగా సాగాయి. ఇరుజట్లు సమంగా నిలిచాయి. తొలిదైన పురుషుల 60 మ్యాచ్‌లో ఎంవీ నవీన్ 0–1తో రుద్ర నాయక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితే, స్పెషల్ కేటగిరీ మ్యాచ్‌లో బుట్ట సింగ్ 1–0తో కొచ్చి ఆర్మ్ రెజ్లర్ ఆసిఫ్ అహెమ్ను ఓడించాడు. మహిళల 53కేజీ మ్యాచ్‌లో సవిత కుమారి 1–0తో అభిరామిపై విజయం సాధించి కిరాక్ హైదరాబాద్‌కు 2–1తో ఆధిక్యం కట్టబెట్టింది. అండర్ కార్డ్‌లో చివరిగా 100 కేజీల పోరులో జగదీశ్ 0–1తో ప్రిన్స్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో, అండర్ కార్డ్ రౌండ్‌ను ఇరు జట్లూ 2–2తో ముగించాయి.
చివరిలో తడబాటు ..
మెయిన్ కార్డ్‌లోనూ హైదరాబాద్‌కు సరైన ఆరంభం లభించలేదు. కిరాక్ హైదరాబాద్ స్టార్ ఆర్మ్ రెజ్లర్ మధుర మొదటిదైన 65 కేజీ మ్యాచ్‌లో 0–5తో చేతన శర్మ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా హైదరాబాద్ 2–7తో వెనుకబడింది. తర్వాత జరిగిన పురుషుల 70 కేజీ పోరులో స్టీవ్ థామస్ 10–0తో ఆకాశ్ కుమార్‌ను ఓడించడంతో హైదరాబాద్ 12–7తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ, 65 ప్లస్ కేజీ కేటగిరీలో జిన్సీ జోస్ 0–10తో యోగేశ్ చౌదరి చేతిలో పరాజయం పాలవడంతో కొచ్చి 17–12తో ముందంజ వేసింది. కీలకమైన 80 కేజీ పోరులో హైదరాబాద్ కెప్టెన్ అస్కర్ అలీ 10–0తో ప్రిన్స్ ధిర్‌ను చిత్తు చేయడంతో హైదరాబాద్ 22–17తో మళ్లీ ఆధిక్యం సాధించింది. ఆపై, 90 కేజీ పోరులో సిద్దార్థ్ మలాకర్ 5–0తో కొచ్చి ఆర్మ్ రెజ్లర్ అక్బర్ షేక్‌ను ఓడించడంతో కిరాక్ హైదరాబాద్ 27–17తో పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. కానీ, చివరిదైన ప్లస్ 100 కేజీల పోరులో ఉజ్వల్ అగర్వాల్ 0–10 తేడాతో మజాహిర్ సైదు చేతిలో ఓడిపోవడంతో స్కోరు 27–27తో సమం అయింది.
టై బ్రేకర్‌లో బోల్తా ..
విజేతను నిర్ణయించే టై బ్రేకర్‌లో కిరాక్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. మిక్స్డ్ వెయిట్ కేటగిరీ తొలిపోరులో స్టీవ్ థామస్ 1–0తో రుద్ర నాయక్‌పై గెలిచాడు. రెండో పోరులో కెప్టెన్ అస్కర్ అలీ 0–1తో ముజాహిర్ చేతిలో ఓడిపోయాడు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మధుర 0–1తో చేతన శర్మ చేతిలో, జిన్సీ జోస్ 0–1తో యోగేశ్ చౌదరి చేతిలో పరాజయం పాలవడంతో హైదరాబాద్ ట్రోఫీని చేజార్చుకుంది.