PT Usha: పరుగుల రాణి పీటీ ఉషపై 3 రోజుల నుంచి ఎందుకు మరీ ఇంతలా విమర్శలు?

PT Usha: లైంగిక వేధింపులపై టాప్ మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న వేళ వారికి వ్యతిరేకంగా పీటీ ఉష ఎందుకు మాట్లాడారు? పీటీ ఉషపై దేశంలోని ప్రముఖులు ఎందుకు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు?

PT Usha: పరుగుల రాణి పీటీ ఉషపై 3 రోజుల నుంచి ఎందుకు మరీ ఇంతలా విమర్శలు?

PT Usha

Updated On : April 29, 2023 / 6:33 PM IST

PT Usha: ఎవరైనా వేగంగా పరిగెడితే పీటీ ఉషలా పరిగెడుతున్నావంటారు. దేశంలో అంతగా పేరు తెచ్చుకున్నారు ఈ అథ్లెట్. 1980 నుంచి 1998 వరకు ఒలింపిక్ గేమ్స్ నుంచి ఆసియా గేమ్స్ వరకు ఎన్నో పోటీల్లో పాల్గొని భారత్ కు పతకాల పంట పండించారు పీటీ ఉష.

భారత్ కు నాలుగు ఏసియన్ గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్ సాధించిపెట్టిన ఆమెపై మూడు రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పీటీ ఉషను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ సింగ్ (Ram Nath Kovind) స్పోర్ట్స్ కోటాలో రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేశారు. 2022 డిసెంబరులో ఆమె ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (Indian Olympic Association)కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద… న్యాయం కోసం భారత టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ గా మహిళ ఉండడంతో ఆమె నుంచి తమకు మద్దతు వస్తుందని రెజ్లర్లు భావించారు. అయితే, పీటీ ఉష (PT Usha) మాత్రం రెజ్లర్లను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

రెజ్లర్లు ఇలా వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ఏంటని, వారి తీరు క్రీడా రంగానికి, దేశానికి కూడా మంచిది కాదని పీటీ ఉష అన్నారు. రెజ్లర్లు క్షమశిక్షణా రాహిత్య చర్యకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు పార్టీలు, ప్రజలు, సెలబ్రిటీల నుంచి రెజ్లర్లకు పెద్ద ఎత్తున వస్తోంది. పీటీ ఉష మాత్రం ఇలా మాట్లాడడం వెనుక బీజేపీ ప్రభావం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికే పీటీ ఉషకు రెజ్లర్లు గట్టిగా సమాధానం ఇచ్చారు. మొదట పీటీ ఉష, రెజ్లర్ల మధ్య (PT Usha Vs Wrestlers) మాటల యుద్ధం జరిగింది. మూడు రోజుల నుంచి రెజ్లర్లకు మరింత మద్దతు పెరిగి, పీటీ ఉషపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ మద్దతు ఉండడం వల్లే పీటీ ఉష ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కొందరు అంటున్నారు.

జమ్మూకశ్మీర్ నుంచి కేరళ వరకు..

జమ్మూకశ్మీర్ నుంచి కేరళ వరకు అన్ని ప్రాంతాల నేతలూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేత శశి థరూర్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది(MP Priyanka Chaturvedi) , టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, బాలీవుడ్ నటి పూజా భట్, నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ వంటి చాలా మంది క్రీడాకారులు పీటీ ఉషపై తీవ్ర విమర్శలు చేశారు.

క్రీడా రంగానికి సంబంధించిన మహిళ అయుండి.. మహిళా రెజ్లర్లకు మద్దతు తెలపకపోవడమే కాకుండా, ఆ బాధితుల వల్ల దేశ ఇమేజ్ కి చేటు అనడం ఏంటని నిలదీశారు. లైంగిక వేధింపుల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే వారి వల్ల దేశ కీర్తి దెబ్బతింటుందని అనడం సరికాదని పీటీ ఉషపై ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు.

పీటీ ఉషలాంటి స్పోర్ట్స్ ఐకాన్ ఇప్పుడు మహిళా రెజ్లర్లను ఇలా అవమానించడం సరికాదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. పీటీ ఉష చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తుల్లో లైంగిక వేధింపుల బాధితులు నోరు విప్పకుండా చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడడం అంటే దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం కాదని కాంగ్రెస్ నేత శశిథరూర్ విమర్శలు గుప్పించారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహా పలువురు ట్రైనర్ల నుంచి మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న వేళ వారికి వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల పీటీ ఉషపై ఇంతమంది మాటల తూటాలు పేల్చుతున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన పీటీ ఉష ఇప్పుడు ఇంతలా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Wrestlers: రెజ్లర్ల వద్దకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు