PT Usha Vs Wrestlers: వీధుల్లోకి వచ్చి ఇలా చేస్తారా? అంటూ రెజ్లర్లపై పీటీ ఉష ఆగ్రహం.. గట్టిగా బదులిచ్చిన రెజ్లర్లు
PT Usha Vs Wrestlers: లైంగిక వేధింపుల పట్ల ఆందోళనకు దిగిన రెజ్లర్లపై పీటీ ఉష చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

PT Usha Vs Wrestlers
PT Usha Vs Wrestlers: న్యాయం కావాలంటూ భారత టాప్ రెజ్లర్లు చేస్తోన్న పోరాటంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉష (PT Usha) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహా పలువురు ట్రైనర్ల నుంచి మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని తాజాగా, విఘ్నేశ్ ఫొగట్ తో పాటు మరో ఏడుగురు రెజర్లు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. వారిలో ఓ మైనర్ కూడా ఉంది.
దీనిపై పీటీ ఉష మాట్లాడుతూ… “ఆ రెజ్లర్లు ఇలా వీధుల్లోకి వచ్చి నిరసన తెలపకపోతే బాగుండేది. కనీసం కమిటీ రిపోర్టు వచ్చేవరకైనా వేచి చూడాల్సింది. వారు చేసిన పని ఆటకు, దేశానికి మంచిది కాదు. ఇది ఓ ప్రతికూల విధానం” అని చెప్పారు. రెజ్లర్ల చర్యను క్షమశిక్షణా రాహిత్య చర్యగా అభివర్ణించారు.
వీధుల్లోకి వెళ్లి నిరసన తెలిపేముందు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వద్దకు వస్తే బాగుండేదని చెప్పారు. రెజ్లర్ల తీరు రెజ్లర్లకే కాకుండా క్రీడారంగానికే మంచిది కాదని చెప్పారు. కాస్త క్రమశిక్షణ ఉంటే బాగుండేదని విమర్శించారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)తో పాటు, దాని చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు, పీటీ ఉష చేసిన వ్యాఖ్యలపై రెజ్లర్లు స్పందించారు. “ఓ మహిళా అథ్లెట్ అయ్యుండి.. ఇతర మహిళా అథ్లెట్ల గురించి ఆమె పట్టించుకోవట్లేదు. క్రమశిక్షణారాహిత్యం ఇక్కడ ఎక్కడ ఉంది. మేము ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. పీటీ ఉష తన అకాడమీ విషయంలో కూడా మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు కదా?” అని రెజ్లర్లు విమర్శించారు.
IPL Franchises: ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతి భారీ ఆఫర్లు.. షరతులు?