ద్రవిడ్ ఎఫెక్ట్: జూనియర్లకు కోచ్‌లుగా సీనియర్లు

ద్రవిడ్ ఎఫెక్ట్: జూనియర్లకు కోచ్‌లుగా సీనియర్లు

Updated On : February 13, 2019 / 2:20 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్ ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్‌‌పై బాగా కనిపిస్తోంది. అండర్-19జట్టుకు కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దిన ద్రవిడ్ బాటలోనే పాకిస్తాన్ క్రికెట్ నడుస్తోంది. గతేడాది జరిగిన అండర్ -19 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ట్రోఫీ గెలిచిన తర్వాత క్రెడిట్ మొత్తం ద్రవిడ్‌కే ఆపాదించారు క్రికెటర్లు.

ఇదే తరహాలో ఆలోచించిన పాకిస్తాన్ తమ జూనియర్లకు కూడా అదే విధంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్‌ను అండర్-19జట్టుకు కోచ్, మేనేజర్‌గా నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. యూనస్ కూడా ద్రవిడ్ లాగే టెస్టు క్రికెట్‌లో దిట్ట. పాకిస్తాన్ జట్టు తరపున ఆడి 10వేల టెస్టు పరుగులు పూర్తిచేసిన మొదటి పాక్ క్రికెటర్‍గా నిలిచాడు. 

ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహసన్ మాని మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా జట్టు కూడా టాప్ ప్లేయర్లు రోడ్నీ మార్ష్, అల్లాన్ బోర్డర్, రిక్కీ పాంటింగ్‌లను జట్టుకు సహాయ సిబ్బందిగా వాడుతుంది. టీమిండియా మేనేజ్‌మెంట్ ద్రవిడ్‌ను అండర్-19 జట్టుకు, భారత్ ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించింది. ఇలా వారు అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్నారు’  అని పేర్కొన్నారు.