గుడ్ బై RR.. ఛలో CSK..! చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్..?
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ బిగ్ షాకివ్వబోతున్నాడా..? చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడా..

Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ బిగ్ షాకివ్వబోతున్నాడా..? చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సంజు శాంసన్ తాజాగా పోస్టు చేసిన ఫొటో క్రికెట్ అభిమానుల్లో పలు అనుమానాలకు తావునిస్తోంది. సంజూ తన భార్యతో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఫొటోను ఇన్‌స్టాలో ఫోస్టు చేశాడు. ఆ పోస్టుకు ‘కదలాల్సిన సమయం..!!’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోలో రోడ్డుపైన ఎల్లో గీతను తన సతీమణితో కలిసి దాటుతున్నట్లు ఉంది. దీంతో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లబోతున్నాడంటూ సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.
View this post on Instagram
ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే, కొన్ని మ్యాచ్ ల అనంతరం గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో చెన్నై కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీ చేపట్టాడు. వచ్చే సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా కొనసాగించేందుకు చెన్నై యాజమాన్యం సుముఖంగా లేదని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ వరకు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను చెన్నై జట్టులోకి తీసుకొని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆ జట్టు యాజమాన్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. రెండేళ్ల వేలంలో భాగంగా వచ్చే ఏడాదికి కూడా అతను రాజస్థాన్ జట్టుకు ఆడాల్సి ఉంది. అయితే, సీఎస్‌కే, ఆర్ఆర్ యాజమాన్యాలు ఒప్పందం చేసుకొని మార్పిడి చేసుకోవచ్చు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్ ను విడుదల చేస్తే అతను చెన్నై జట్టులోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
మరోవైపు ఆర్ఆర్ యాజమాన్యం కూడా ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్‌లో సంజూ శాంసన్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవటంతో వదలుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సంజ శాంసన్ తన ఇన్‌స్టాలో పోస్టుచేసిన ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అతను ఆర్ఆర్‌ను వీడి సీఎస్కే జట్టులోకి వెళ్లబోతున్నాడంటూ.. అందుకు ఉదాహరణ ఈ ఫొటో.. ఫొటోకు సంజూ ఇచ్చిన క్యాప్షనే అంటూ పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.