IND vs ENG : భారత జట్టుకు బిగ్ షాక్ .. మూడో టెస్టు నుంచి అర్థాంతరంగా వైదొలగిన అశ్విన్

అశ్విన్ మూడో టెస్టు రెండోరోజు ఆటలో వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ ఘనతకెక్కాడు.

IND vs ENG : భారత జట్టుకు బిగ్ షాక్ .. మూడో టెస్టు నుంచి అర్థాంతరంగా వైదొలగిన అశ్విన్

Ravichandran Ashwin

Updated On : February 17, 2024 / 7:56 AM IST

Ravichandran Ashwin : రాజ్ కోట్ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో కుదురుకుపోయిన క్రమంలో మూడో రోజు ఆట కీలకంగా మారనుంది. మూడో రోజు స్పిన్నర్లు రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజాలు రాణిస్తే ఇంగ్లండ్ బ్యాటర్లను త్వరగా పెవిలియన్ కు చేర్చవచ్చునని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు. ఈ తరుణంలో భారత్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీలక స్పిన్నర్ గా ఉన్న అశ్విన్ మూడో టెస్టు నుంచి అర్థాంతరంగా వైదొలిగారు.

Also Read : IND vs ENG 3rd Test : బెన్‌డ‌కెట్ శ‌త‌కం.. అశ్విన్ 500 వికెట్లు.. భార‌త్‌కు దీటుగా బ‌దులిస్తున్న ఇంగ్లాండ్‌..

అశ్విన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మూడో టెస్టు నుంచి అర్థాంతరంగా అశ్విన్ వైదొలగాల్సి వచ్చిందని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండటంకోసం అశ్విన్ రాజ్ కోట్ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. అశ్విన్ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని రాజీవ్ శుక్లా ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా, అభిమానులు అశ్విన్, వారి కుటుంబ సభ్యుల గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని బీసీసీఐ బోర్డు పేర్కొంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్ కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమిండియా జట్టు అందిస్తుందని పేర్కొంది.

Also Read : Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు

అశ్విన్ మూడో టెస్టు రెండోరోజు ఆటలో వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ ఘనతకెక్కాడు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు బ్యాటర్లు క్రీజులో కుదురుకుపోయారు. బెన్ డకెట్ 113 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడోరోజు ఆటలో బౌలర్లు పుంజుకొని ప్రత్యర్థి జట్టును త్వరగా ఆలౌట్ చేస్తేనే మ్యాచ్ పై భారత్ జట్టుకు పట్టువస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ మ్యాచ్ నుంచి వైదొలగడం జట్టుకు ఇబ్బందికర పరిస్థితే. ప్రస్తుతం జట్టులో పూర్తిస్థాయి బౌలర్లు నలుగురే ఉన్నారు. అశ్విన్ వైదొలగడంతో వీరిపైనే భారం పడనుంది.