Yash Dayal : ఇబ్బందుల్లో ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాల్.. అతడిపై ఫోక్సో కేసు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు యశ్ దయాళ్‌కు వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి.

RCB pacer Yash Dayal in more trouble pocso case registered
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు యశ్ దయాళ్‌కు వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. యూపీకి చెందిన ఓ యువతి ఇటీవల అతడి పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌కు చెందిన యువ క్రికెట్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు చేసింది. తన క్రికెట్ కెరీర్‌లో సాయం చేస్తానని నమ్మించి రెండు సంవత్సరాలకు పైగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు యశ్ దయాల్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు.
జైపూర్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా యశ్‌ను తొలిసారి కలిసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనకు క్రికెట్‌లో సాయం చేస్తానని నమ్మించి సీతాపురలోని ఓ హోటల్‌కు తనను పిలిచి అక్కడ దాడి చేశాడని ఆరోపించింది. ఆ తరువాత నుంచి తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్ల పాటు తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో వెల్లడించింది. లైంగిక వేధింపులు మొదలైనప్పుడు ఆ యువతి వయసు 17 ఏళ్లు కావడంతో ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వరుస లైంగిక ఆరోపణల కారణంగా యశ్ దయాల్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆరోపణలు నిజమని రుజువైతే యశ్ దయాల్‌కు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున అరంగ్రేటం చేశాడు యశ్ దయాల్. ఆ సీజన్‌లో 11 వికెట్లు తీశాడు. ఇక 2025 మెగా వేలంలో ఆర్‌సీబీ జట్టు అతడిని దక్కించుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో యశ్ దయాల్ ఆర్‌సీబీ కీలక బౌలర్‌గా మారాడు. సీజన్‌లో 13 వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.