ENG vs IND : ఈ రోజు నేనేంటో చూపిస్తా.. నిన్న వికెట్ తీసినా నా బౌలింగ్ పై సంతృప్తిగా లేను : అన్షుల్ కాంబోజ్

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ద్వారా అన్షుల్ కాంబోజ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేశాడు.

ENG vs IND : ఈ రోజు నేనేంటో చూపిస్తా.. నిన్న వికెట్ తీసినా నా బౌలింగ్ పై సంతృప్తిగా లేను : అన్షుల్ కాంబోజ్

Not satisfied with my bowling says Debutant Anshul Kamboj

Updated On : July 25, 2025 / 1:11 PM IST

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ద్వారా అన్షుల్ కాంబోజ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేశాడు. ఈ కుడి చేతి వాటం పేస‌ర్ బ్యాటింగ్‌లో ప‌రుగులు ఏమీ చేయ‌లేదు. ఇక బౌలింగ్‌లో త‌న తొలి ఓవ‌ర్‌లోనే 12 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అయితే.. తొలి స్పెల్ లో వికెట్లు ఏమీ ప‌డ‌గొట్ట‌న‌ప్ప‌టికి కూడా రెండో స్పెల్‌లో డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ బెన్ డ‌కెట్ (94) ను ఔట్ చేసి.. టెస్టుల్లో త‌న తొలి వికెట్ సాధించాడు.

రెండో రోజు మ్యాచ్ అనంత‌రం అన్షుల్ కాంబోజ్ మాట్లాడుతూ.. త‌న బౌలింగ్ పై సంతృప్తిక‌రంగా లేన‌ని చెప్పాడు. మూడో రోజు ఆట‌లో మెరుగ్గా బౌలింగ్ చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక తొలి వికెట్ తీయ‌డం గురించి మాట్లాడుతూ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ తీయ‌డం ఎంతో బాగుంద‌న్నాడు. “నేను అనుకున్న ప్ర‌కారం కొన్ని బంతుల‌ను స‌రైన ప్రాంతంలో వేయ‌గ‌లిగా, మ‌రికొన్ని సార్లు అలా చేయ‌లేక‌పోయాను. అయితే.. మూడో రోజు ఆట‌లో నాణ్య‌మైన బౌలింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తా. ఇంగ్లాండ్‌ను వీలైనంత త్వ‌ర‌గా ఆలౌట్ చేసేందుకు చూస్తాం.” అని కాంబోజ్ అన్నాడు.

నువ్వు సూపర్ భయ్యా.. గాయంతోనూ రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్.. కానీ, అతనికి బై రన్నర్ ఎందుకు ఇవ్వలేదు..? ఇచ్చిఉంటే..!

సీనియ‌ర్ పేస‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌ల నుంచి నేర్చుకునే అవ‌కాశం ద‌క్క‌డం త‌న అదృష్టంగా చెప్పుకొచ్చాడు. క్లిష్ట ప‌రిస్థితుల్లో వారు ఎలా స్పందిస్తారు.. ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా ఎలా బౌలింగ్ చేస్తారు అనే విష‌యాల‌ను గ‌మ‌నించాను. వారితో త‌ర‌చుగా మాట్లాడుతూ.. ప‌రిస్థితుల‌కు త్వ‌ర‌గా ఎలా అల‌వాటుప‌డాల‌నే విష‌యం పై దృష్టి పెట్టాను అని కాంబోజ్ తెలిపాడు.

ఇక నాలుగో టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 2 వికెట్ల న‌ష్టానికి 225 ప‌రుగులు చేసింది. ఓలీ పోప్ (20), జో రూట్ (11) లు క్రీజులో ఉన్నారు. భార‌త తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లాండ్ ఇంకా 133 ప‌రుగులు వెనుకబ‌డి ఉంది.