Rishabh Pant : గెలవడం చాలా బాగుంది.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్..
సీఎస్కే పై విజయం సాధించడం పట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Rishabh Pant comments after Lucknow Super Giants beat Chennai Super Kings (pic credit@ipl)
- సీఎస్కే పై విజయం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్
- కీలక వ్యాఖ్యలు
Rishabh Pant : శక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే పై విజయం సాధించడం పట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గెలవడం చాలా బాగుందన్నాడు. ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇదే విధంగా రాణిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. కాగా.. ఇప్పటికే లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.
కార్తీక్ శర్మ (71; 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆఖరిలో శివమ్ దూబె (16 బంతుల్లో 32 నాటౌట్) వేగంగా ఆడాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షమీ, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (90; 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్ (32 నాటౌట్; 17 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. సీఎస్కే బౌలర్లలో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ లు చెరో వికెట్ పడగొట్టారు.
ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించినప్పటికి
ఇక మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ సీఎస్కే పై గెలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. విజయం సాధించం ఎప్పుడూ మంచి అనుభూతిని ఇస్తుందన్నాడు. తాము ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించినప్పటికి కూడా ప్రతి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని భావిస్తున్నామన్నాడు. ఇదే విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్నామని తెలిపాడు.
యువ ఆటగాడు ఆకాశ్ సింగ్ పై పంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ఈ ఐపీఎల్ అంతటా కష్టపడుతూనే ఉన్నాడని అన్నాడు. కొన్నిసార్లు అందరికీ ఆడే అవకాశం ఇవ్వడం కష్టమని, అయినప్పటికి కూడా ఆటగాళ్లందరూ చాలా బాగా సన్నద్ధం అవుతున్నారని అన్నాడు. ఆకాశ్ కూడా ప్రిపరేషన్ ఎన్నడూ ఆపలేదన్నాడు. ప్రణాళికలకు కట్టుబడి బౌలింగ్ చేయడంలో అతడు దిట్ట అని అన్నాడు. అతడి కృషి ఫలించినందుకు ఆనందంగా ఉందన్నాడు.
Ruturaj Gaikwad : లక్నోపై ఓటమి తరువాత చెన్నై ఆటగాళ్లకు రుతురాజ్ గైక్వాడ్ బిగ్ మెసేజ్..
ఇక ఓపెనింగ్ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఓపెనింగ్‌కు పంపడం, నికోలస్ పూరన్‌ను మూడో స్థానంలో ఆడించడం తమ మొదటి ఆలోచన అని పంత్ చెప్పాడు. అయితే.. ఆలోచనలను మైదానంలో అమలు చేయడం కొన్ని సార్లు కష్టం అవుతుందన్నాడు. ఇక సొంత మైదానంలో నలుగురు పేసర్లలో ఆడడం కలిసి వచ్చిందన్నాడు. తాను బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానని, అయితే.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు తనకు ఓ ఆలోచన వచ్చిందన్నాడు. ఇప్పటి వరకు అవకాశం రానీ ఆటగాళ్లకు ఎందుకు దించకూడదు అని అనుకున్నానని అన్నాడు. ఈ క్రమంలోనే తక్కువ అవకాశాలు వచ్చిన వారికి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చామన్నాడు.
