టీ20ల్లో టాప్: రోహిత్ శర్మ నయా రికార్డు

టీ20ల్లో టాప్: రోహిత్ శర్మ నయా రికార్డు

Updated On : February 8, 2019 / 9:59 AM IST

టీ20 స్పెషలిస్టుగా పేరొందిన హిట్ మాన్.. రోహిత్ శర్మ మరో రికార్డును పట్టేశాడు. షార్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు బాదిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గఫ్తిల్ పేరిట ఉన్న 2272పరుగుల రికార్డును ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో టీ20ల్లో తుడిచిపెట్టేశాడు. 29 బంతుల్లో 16వ టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసిన రోహిత్.. కెరీర్‌లో 2288 అత్యధిక పరుగులు చేసి టాప్ స్థానంలో నిలిచాడు. ఈ పరుగులు చేయడానికి రోహిత్ 92 మ్యాచ్‌లు తీసుకున్నాడు. ఇంకా టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన ఘనత కూడా రోహిత్ పేరిట ఉంది. 

రెండో టీ20ని పట్టుదలగా భావించిన భారత ప్లేయర్లు దూకుడైన ఆటను కనబరిచారు. ఈ మేర 159 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా బాదేస్తారని భావించిన వేళ ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో కాస్తంత తడబడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్.. ఎంఎస్ ధోనీలు మ్యాచ్ చక్కటి ముగింపునిచ్చారు. తొలి టీ20లో భారత్ ఘోరంగా 80పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 

ఆఖరిదైన టీ20 మ్యాచ్ పూర్తి చేసుకున్న తర్వాత భారత్.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో ఫిబ్రవరి 24నుంచి జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడనుంది.