IPL 2023, RR vs CSK: దేనికి బ్రేక్ పడనుంది..? చెన్నై విజయాలకా లేక రాజస్థాన్ ఓటములకా..?
ఐపీఎల్(IPL) 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడనుంది.ఈ సీజన్‌లో చెన్నై, రాజస్థాన్‌లు ముఖాముఖిగా తలపడడం ఇది రెండో సారి. మొదటి సారి రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో గెలిచింది.

RR vs CSK
IPL 2023, RR vs CSK: ఐపీఎల్(IPL) 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో ఏడు మ్యాచ్‌లు ఆడగా చెన్నై ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన రాజస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు బాట పట్టాలని బావిస్తుండగా తమ విజయాల పరంపరను కొనసాగించాలని చెన్నై జట్టు పట్టుదలతో ఉంది.
సమిష్టిగా రాణిస్తుండడం చెన్నై మొక్క విజయ రహస్యం. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలు అద్భుత ఆరంభాలు ఇస్తుండగా అజింక్యా రహానే, శివమ్ దూబేలు చెలరేగి ఆడుతున్నారు. ఆఖర్లో ఫినిషింగ్ ఇచ్చేందుకు ఎలాగో ధోని, జడేజా ఉండనే ఉన్నారు. వీరితో పాటు మోయిన్ అలీ కూడా ఫామ్ అందుకుంటే చెన్నైకి తిరుగులేదు. మొత్తంగా బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉండడం సీఎస్‌కేకు కలిసివచ్చే అంశం. బెన్‌స్టోక్స్ వంటి సీనియర్ల గైర్హజరీలో అందివచ్చిన అవకాశాలను పేసర్లు తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్, మతీష పతీరణ సద్వినియోగం చేసుకుంటున్నారు. స్పిన్నర్లు మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజాలు ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన ఉత్సాహంగా ఉన్న చెన్నై నేడు కూడా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.
IPL 2023, CSK Vs RR: చెన్నైను చిత్తు చేసిన రాయల్స్
ఓపెనర్లు జైశ్వాల్, బట్లర్‌తో పాటు సంజు శాంసన్, హెట్‌మయర్‌లతో కూడిన బ్యాటింగ్ విభాగం రాజస్థాన్ సొంతం. అయితే.. నిలకడగా ఆడలేకపోతుండడం అది పెద్ద మైనస్. వీరిలో ఏ ఇద్దరు చెలరేగిన భారీ స్కోరు సాధించడం ఖాయం. జాసన్ హోల్డర్ స్థానంలో జంపాకు తుది జట్టులో స్థానం దక్కొచ్చు. ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ మరోసారి బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, చాహల్‌లు చెన్నై బ్యాటర్లను ఎంత మేరకు కట్టడి చేస్తారు అన్న దానిపై రాజస్థాన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఈ సీజన్‌లో చెన్నై, రాజస్థాన్‌లు ముఖాముఖిగా తలపడడం ఇది రెండో సారి. మొదటి సారి రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో గెలిచింది.
తుది జట్ల (అంచనా)
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, జాసన్ హోల్డర్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, మతీషా పతిరనా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్