CSK vs MI : ధోని రిటైర్‌మెంట్ పై రుతురాజ్ కీలక వ్యాఖ్యలు.. సచిన్‌ను ఉదాహరణగా చూపిస్తూ..
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

pic credit @ csk
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాకిచ్చింది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో అందరి దృష్టి ఎంఎస్ ధోనిపై పడింది.
ఈ సీజన్ ముగిసిన తరువాత ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు చెబుతాడనే వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. సచిన్ ను ఉదాహరణగా చూపిస్తూ రుతురాజ్ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ధోని మరికొన్నాళ్ల పాటు ఆటను కొనసాగిస్తాడని అతడు పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
సీఎస్‌కే, ముంబై మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధోని రిటైర్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్న రుతురాజ్ గైక్వాడ్‌కు ఎదురైంది. ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అద్భుతంగా ఆడడాన్ని ప్రస్తావిస్తూ.. 50 ఏళ్ల వయసులో సచిన్ అద్భుతంగా ఆడడం చూశాం. ఇలా చూసుకుంటే ధోనిలో మరికొన్నాళ్ల పాటు క్రికెట్ మిగిలే ఉన్నట్లు అనిపిస్తోందన్నాడు.
తనతో పాటు జట్టులోని వారంతా ధోని నుంచి ఎంతో నేర్చుకుంటున్నట్లుగా రుతురాజ్ చెప్పాడు. 43 ఏళ్ల వయసులోనూ జట్టు కోసం ఏం చేయడానికైనా ధోని సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తమ ప్రణాళికల్లో పెద్దగా మార్పులు లేనట్లుగా వివరించాడు. కీలక మ్యాచ్‌ల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామన్నాడు.
CSK vs MI : ముంబైతో మ్యాచ్.. అరుదైన రికార్డు పై ధోని కన్ను.. చరిత్ర సృష్టించేనా?
ఐపీఎల్‌లో ధోని పాత్ర ఏంటి అన్నదానిపై అతడితో పాటు మాకు ఓ స్పష్టమైన అవగాహన ఉందని రుతురాజ్ చెప్పాడు. క్రీజులో ఉన్నంత సేపు సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నిస్తాడని చెప్పాడు. మొదటి రోజు అతడు సక్సెస్ కాకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదన్నాడు. ధోని ఎల్లప్పుడూ ప్రత్యేకమైన వాడని, చాలా ఏళ్లు జట్టు కోసం ఎంతో చేశాడని అన్నాడు.
గత రెండు సీజన్లుగా ధోని 8 స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌ల్లో 220.55 స్ట్రైక్‌రేటుతో 161 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి.