ENG vs IND : మూడో స్థానానికి కరుణ్ నాయర్ కరెక్ట్ కాదు.. ఇతడిని ఆడించండి.. మాజీ క్రికెటర్
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sanjay Manjrekar wants Sai Sudharsan to be called back into India playing XI for Lords Test
తొలి టెస్టులో ఓడిపోయినప్పటికి అద్భుతంగా పుంజుకుని రెండో టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇక లార్డ్స్ వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ గత రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో అతడికి చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకుంటే మంచిదని పలువురు మాజీ క్రికెటర్లు మేనేజ్‌మెంట్ కు సూచిస్తున్నారు.
లార్డ్స్‌లో టీమ్ఇండియా తుది జట్టు కూర్పు పై మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు. గత మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర ఎంపికలు జరిగాయని, వాటిలో కొన్నింటిని తాను అంగీకరించలేదని చెప్పాడు. అయితే.. మ్యాచ్ గెలవడంతో ఆ నిర్ణయాలు అన్ని కవర్ అయ్యాయని తెలిపాడు.
యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను ఒక్క మ్యాచ్‌కే పక్కన పెట్టాలని అనుకోవడం కరెక్ట్ కాదన్నాడు. ‘తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు కాస్త ఫర్వాలేదనిపించాడు. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఇక లార్డ్స్ తుది జట్టులో అతడికి చోటు ఇవ్వాలి. మూడో స్థానంలో వస్తున్న కరుణ్ నాయర్ పెద్దగా ఆడడం లేదు. ఆ స్థానానికి సాయి సుదర్శన్ కరెక్ట్ అని నా అభిప్రాయం. బ్యాటింగ్ ఆర్డర్ పై మేనేజ్‌మెంట్ ఇంకాస్త దృష్టి పెడుతుందని భావిస్తున్నా.’ అని మంజ్రేకర్ అన్నాడు.
హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికి రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేశాడు.