ఇదేందిది.. బ్లాక్ సాక్స్ వేసుకుంటే కూడా ఫైన్ వేస్తారా?.. శుభ్ మన్ గిల్ కు షాక్ తప్పదా? ఐసీసీ రూల్ 19.45 ఏం చెబుతోంది?
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాకిచ్చేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Shubman Gill
Shubman Gill: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఇండియా వర్సెస్ భారత జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి మూడు వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (101), కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (127 బ్యాటింగ్) సెంచరీలతో అదరగొట్టారు. గిల్ తో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (65 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
19.45 నిబంధన ప్రకారం..
తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఐసీసీ నిబంధనను అతిక్రమించాడు. డ్రెస్‌కోడ్ రూల్స్‌ను ఉల్లంఘించాడు. కేఎల్ రాహుల్ ఔట్ అయిన తరువాత గిల్ క్రీజులోకి వచ్చాడు. అయితే, ఆ సమయంలో అతను బ్లాక్ సాక్స్ ధరించాడు. టెస్టుల్లో వైట్ సాక్స్ ధరించడం సంప్రదాయం. ఐసీసీ దుస్తులు, సామాగ్రి నియమ, నిబంధనల్లోని 19.45 నిబంధనల ప్రకారం.. టెస్ట్ మ్యాచ్‌లలో ఆటగాడు వైట్, క్రీమ్ లేదా లేత బూడిద రంగు సాక్స్ ధరించాలి.
భారీ జరిమానా ఉంటుందా..
శుభ్‌మన్ గిట్ తొలి టెస్టు మొదటిరోజు ఆటలో భాగంగా బ్లాక్ సాక్స్ వేసుకొని క్రీజులోకి వచ్చాడు. దీంతో అతడు ఐసీసీ నిబంధనను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఫలితంగా అతనికి భారీ జరిమానాను ఐసీసీ విధించే అవకాశం ఉంది. లెవల్ 1 నేరగా పరిగణిస్తే మ్యాచ్ ఫీజులో 10 నుంచి 20శాతం ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా బ్లాక్ సాక్స్ ధరించలేదని రిఫరీ భావిస్తే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. జరిమానా విధించాలా.. లేదా అనేది పూర్తిగా మ్యాచ్ రిఫరీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
గతంలో పలువురికి జరిమానా..
బీవీఎల్ 2016లో ఐసీసీ ఈవెంట్ కానప్పటికీ క్రిస్ గేల్ బ్లాక్ లేబుల్‌తో కూడిన బ్యాట్ వాడాడు. దీంతో అతను మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. 2018లో ఆఫ్గానిస్తాన్ తో టెస్టు మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఐసీసీ భద్రత, ప్రమాణాలను పాటించని హెల్మంట్ ధరించినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించింది. 2021లో ఇండియాతో మ్యాచ్‌లో రెయిన్‌బో కలర్ చిహ్నం ఉన్న జెర్సీని ధరించిన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 15శాతం జరిమానా ఎదర్కొన్నాడు. అదేవిధంగా.. 2019 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ అనధికార వాణిజ్య లోగోతో ఉన్న బ్యాటును ఉపయోగించి జరిమానాను ఎదుర్కొన్నాడు.