RCB vs GT : బెంగళూరుపై మ్యాచ్ విన్నింగ్స్ ప్రదర్శన.. సిరాజ్ భావోద్వేగం..
అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Courtesy BCCI
ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ విజయాన్ని సాధించింది.
గతేడాది వరకు ఆర్‌సీబీ తరుపున ఆడిన సిరాజ్ ఈ సీజన్‌లో గుజరాత్ తరుపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ తన పదునైన పేస్ బౌలింగ్‌తో బెంగళూరు జట్టును బెంబేలెత్తించాడు. తనను వదులుకోవడం ఎంత తప్పో బెంగళూరుకు తెలిసి వచ్చేటట్లుగా చేశాడు.
NZ vs PAK : కొద్దిలో బాబర్ అజామ్ సెంచరీ మిస్.. నెట్టింట దారుణ ట్రోలింగ్..
దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్ (54; 40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. జితేశ్ శర్మ(33; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (32; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు.
ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవదత్ పడిక్కల్ (4), రజత్ పాటిదార్ (12), కృనాల్ పాండ్యా (5) లు విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టగా, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా, సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (30నాటౌట్; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
7 ఏళ్లు ఇక్కడ ఆడాను..
ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న తరువాత సిరాజ్ మాట్లాడుతూ.. చిన్నస్వామి స్టేడియంతో తనకు ఎన్నో మధురమైన జాప్ఞకాలు ఉన్నాయన్నాడు. ఇక్కడ ఏడేళ్ల పాటు ఆడాను. ఆర్‌సీబీ నుంచి గుజరాత్ కు మారడాన్ని ప్రస్తావిస్తూ.. ఎరుపు రంగు జెర్సీ నుంచి నీలం రంగులోకి మారాను దీంతో భావోద్వేగానికి లోనైనట్లు చెప్పుకొచ్చాడు.
‘ఒక్కసారి బంతి అందుకున్న తరువాత అంతా మారిపోతుంది. ఏ జట్టుకు ఆడుతున్నాము అన్నది ముఖ్యం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా. నేను రొనాల్డో అభిమానిని అందుకే అలా సంబురాలు చేసుకున్నా.’ అని సిరాజ్ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఎంపికకాకపోవడంతో తనకు లభించిన విరామ సమయంలో తన తప్పులను సరిదిద్దుకున్నట్లుగా వెల్లడించాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకున్నట్లుగా చెప్పాడు.
‘వేలంలో నన్ను గుజరాత్ టైటాన్స్ తీసుకున్న తరువాత ఆశిష్ నెహ్రాతో మాట్లాడాడు. అయితే.. నెహ్రా ఒక్కటే చెప్పాడు. నీ బౌలింగ్ ను ఆస్వాదించు అని మాత్రమే అన్నాడు. ఇక ఇషాంశ్ శర్మ మాత్రం ఏ లైన్, ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో అన్న విషయాలను చెప్పాడు. నా పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకనే ఎలాంటి పిచ్‌పై ఆడుతున్నామన్నది పట్టించుకోను.’ అని సిరాజ్ వెల్లడించాడు.