అప్పట్లో అలా బ్యాటింగ్.. ఇప్పుడు ఇలా బౌలింగ్.. టీమిండియాలో భారీ ఛేంజ్

టీమిండియా అంటే బ్యాటింగే కాదు బౌలింగ్‌ కూడా అని నిరూపిస్తున్నారు. తమను ఎదుర్కోవాలంటే గట్స్‌ కావాలని ఆల్‌ రౌండ్‌ పర్‌ఫార్మెన్స్‌తో తేల్చి చెబుతున్నారు టీమిండియా ఆటగాళ్లు.

అప్పట్లో అలా బ్యాటింగ్.. ఇప్పుడు ఇలా బౌలింగ్.. టీమిండియాలో భారీ ఛేంజ్

Pic Credit: @JayShah

బ్యాటింగ్‌ అంటే గుర్తొచ్చే మెుదటి జట్టు భారత్‌. డెప్త్‌ బ్యాటింగ్‌ లైనప్‌తో అదరగొడుతూ.. కొన్నేళ్లుగా టాప్‌ త్రీలో కొనసాగుతోంది. ఇప్పుడు కాలం మారింది. ఎప్పుడూ సిక్సులేనా… ఇక తమ స్వింగ్‌ రుచి చూపిస్తామంటున్నారు బౌలర్లు. యార్కర్లు, స్వింగ్‌, ఆఫ్‌ కట్టర్స్‌, గూగ్లీ ఏ బంతైనా సరే వికెట్లు పడాల్సిందే అంటున్నారు. స్కోరు తక్కువైనా పర్లేదు.. మేము ఉన్నామని గుర్తు చేస్తూ మర్చిపోలేని విజయాలను అందిస్తున్నారు.

టీమిండియా అంటేనే బ్యాటింగ్‌. ఒకప్పుడు సెహ్వాగ్‌, గంభీర్‌, గంగూలీ, యువరాజ్‌ సింగ్‌ వంటి ఆటగాళ్లు బౌలర్లను చీల్చి చెండాడేవాళ్లు. ఆ తర్వాత హిట్‌ మ్యాన్ రోహిత్ శర్మ, రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నారు. వీళ్లలో ఏ ఒక్కరు క్రీజులో ఉన్నా చాలు… జట్టుకు విజయాన్ని అందిస్తారనే ధీమా ఉండేది.

ఛేజింగ్‌‌లో మాత్రమే కాదు
మ్యాచ్‌లో ఇండియా ఛేజింగ్‌ చేసిందంటే గెలుపు పక్కా అయిపోవాల్సిందే. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీమిండియా బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తోంది. తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్‌ చేసే స్థాయికి చేరుకుంది. బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ పేస్‌తో వణికిస్తుంటే.. కుల్‌దీప్‌, అక్షర్‌ స్పిన్‌తో మ్యాచ్‌నే తిప్పేస్తున్నారు.

బౌలింగ్‌ అంటే ఇప్పుడు టక్కున గుర్తొచ్చే పేరు జస్ప్రిత్‌ బుమ్రా. షార్ట్‌ రనప్‌తో అత్యంత వేగంగా లైన్‌ అండ్‌ లెగ్త్‌ బాల్స్‌ వేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ? అది బుమ్రా ఒక్కడే. బుమ్రా బౌలింగ్‌కు వచ్చాడంటే బ్యాటర్లకు సవాల్‌ అనే చెప్పాలి. అదిరిపోయే ఔట్‌ స్వింగ్స్‌, మట్టి కరిపించే యార్కర్లకు బుమ్రా స్పెషలిస్ట్‌. ఈ విషయం నిన్నటి టీ ట్వంటీ వరల్డ్‌ కప్‌లో మరోసారి తేలిపోయింది. అతితక్కువ స్కోర్‌ ఉన్న సమయంలోనూ టీమిండియా డిఫెండ్‌ చేయగలుగుతుందంటే అందుకు ఈ యార్కర్‌ కింగే కారణం.

విజయంలో కీలక పాత్ర
బుమ్రాతో పాటు జట్టులో ఇద్దరు స్పిన్న దిగ్గజాలు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ది టీమిండియా విజయంలో కీలక పాత్ర. సరైన సమయంలో వికెట్లు తీసి ఎక్కువగా డాట్‌ బాల్స్‌ వేసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టారు. ఫైనల్‌ మ్యాచ్‌ మినహాయించి మిగతా అన్ని మ్యాచుల్లో అక్షర్‌ పటేల్‌ తొలి బంతికే వికెట్‌ తీశాడు. ఫైనల్‌లో కాస్త తడబడినప్పటికీ లీగ్‌ దశలో, సూపర్‌ 8లో ఇద్దరూ అదరిపోయే పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.

టీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ సాధించడంలో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రోల్‌ మరువలేనిది. అవసరమైనప్పుడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఫైనల్‌లో పాండ్యా వేసిన ఫైనల్‌ ఓవర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐపీఎల్‌ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న పాండ్యా… టీ ట్వంటీ వరల్డ్‌కప్‌తో హీరో అయిపోయాడు. మరోవైపు యంగ్‌ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ కూడా తనవంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఓపెనింగ్‌ బౌలింగ్‌ వేసిన అర్షదీప్‌ వికెట్లు తీసి బ్యాటర్లను వణికించాడు..

టీమిండియా అంటే బ్యాటింగే కాదు బౌలింగ్‌ కూడా అని నిరూపిస్తున్నారు. తమను ఎదుర్కోవాలంటే గట్స్‌ కావాలని ఆల్‌ రౌండ్‌ పర్‌ఫార్మెన్స్‌తో తేల్చి చెబుతున్నారు టీమిండియా ఆటగాళ్లు.

ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇప్పుడు రవీంద్ర జడేజా