IND vs NZ : మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా కీలక నిర్ణయం.. పిచ్ ఎలా స్పందిస్తుందంటే?
టీమ్ఇండియాకు షాకిచ్చింది న్యూజిలాండ్.

Team India Bold Decision On Wankhede Pitch
IND vs NZ : టీమ్ఇండియాకు షాకిచ్చింది న్యూజిలాండ్. అది అలాంటి ఇలాంటి షాక్ కాదు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆఖరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా జరగనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భారత్ భావిస్తోండగా, క్లీన్‌స్వీప్ చేయాలని న్యూజిలాండ్ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
తొలి, రెండో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన బెంగళూరు, పూణే వేదికల్లోని పిచ్‌లు తొలి రోజు నుంచే స్పిన్నర్లకు సహకరించాయి. భారత బ్యాటర్లు స్పిన్ ఆడడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాంఖడే పిచ్‌ను భిన్నంగా రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పిచ్ తొలి రోజు నుంచే బ్యాటింగ్‌కు అనుకూలించేలా తయారుచేస్తున్నారని సమాచారం.
బీసీసీఐ చీఫ్ పిచ్ క్యూరేటర్ ఆశిశ్ బౌమిక్, ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ పిచ్ గురించి సమీక్షించేందుకు సోమవారం వాంఖడే క్యూరేటర్ రమేశ్ మముంకర్‌ను కలిశారు. మొదటి రోజు బ్యాటింగ్‌కు, రెండో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరించనున్నట్లుగా అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపినట్లు సమాచారం.
వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు 2021 డిసెంబర్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.