WTC Points Table : ఇంగ్లాండ్ పై విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా స్థానం ఎక్కడంటే..?
రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ స్థానానికి చేరుకుంది.

Team India
WTC Points Table 2023-2025 : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ట్రోఫీ ఇప్పటి వరకు భారత్‌కు అందని ద్రాక్షగానే ఉంది. వరుసగా రెండు సీజన్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో ఓడిపోయింది. మూడో సీజన్‌లో ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే గట్టి పటుదలతో భారత్ ఉంది. అందుకు అనుగుణంగానే భారత జట్టు పయనిస్తోంది. రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ రెండో స్థానానికి చేరుకుంది.
గతవారం న్యూజిలాండ్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను గెలుచుకుని అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోగా భారత్ రెండు నుంచి మూడుకు దిగజారింది. అయితే.. రాజ్‌కోట్ టెస్టులో గెలవడంతో ఆసీస్‌ను వెనక్కి నెట్టి మళ్లీ భారత్ రెండో స్థానానికి ఎగబాకింది.
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్‌కు అన్యాయం జరుగుతోందా? మొన్న బుమ్రా, నేడు జడేజా
డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో న్యూజిలాండ్ నాలుగు టెస్టులు ఆడింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడు మ్యాచుల్లో గెలవడంతో 75 విజయశాతం కలిగి ఉంది. దీంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ ఏడు మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడగా ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 59.2 విజయశాతంతో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా 10 మ్యాచులు ఆడింది. ఆరింటిలో గెలవగా మూడు మ్యాచుల్లో ఓడింది. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 55 విజయశాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఆ తరువాత బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), దక్షిణాఫ్రికా (25) వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ 21 విజయశాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన లంక జట్టు ఆఖరి స్థానంలో నిలిచింది.