Team India: ప్రపంచకప్ లో టీమిండియా ఆధిపత్యం.. ఎలా సాధ్యమైంది?

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ లో దూసుకుపోతోంది. సమిష్టిగా రాణిస్తూ వరుసగా విక్టరీలు కొడుతోంది. టీమిండియా విజయాల వెనుకున్న సీక్రెట్ ఏంటి?

Team India: ప్రపంచకప్ లో టీమిండియా ఆధిపత్యం.. ఎలా సాధ్యమైంది?

Team India

ICC Cricket World Cup 2023: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతోంది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ ఫైనల్లో తొలి అడుగు వేసింది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టుకు వెన్నుముఖగా నిలిచి విజయాలు అందిస్తున్నారు. శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తలో చేయి వేస్తున్నారు. బౌలింగ్ లో మహ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మెరుపులతో కీరోల్ ప్లే చేస్తున్నాడు.

Virat Kohli

Virat Kohli

కింగ్ కోహ్లి సత్తా
రోహిత్, కోహ్లి పోటీ పడి పరుగులు సాధిస్తున్నారు. కోహ్లి 8 మ్యాచుల్లో 6 ఇన్నింగ్స్ లో 50 ప్లస్ స్కోరు చేసి సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 543 పరుగులతో టాప్ రన్ స్కోరర్ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటివరకు 31 ఇన్నింగ్స్ ఆడి 7 సెంచరీలు బాదాడు. అంతేకాదు పలు రికార్డులు తిరగరాశాడు. వన్డేల్లో 49వ సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. మరో సెంచరీ చేస్తే సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తాడు. క్యాలెండర్ ఇయర్ లో అత్యధికసార్లు వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు.

Rohit Sharma

Rohit Sharma

రోహిత్ పవర్ ఫుల్ ప్లే
ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కూడా పవర్ ఫుల్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. మెగా టోర్నిలో ఇప్పటివరకు 442 పరుగులు సాధించాడు. పవర్ ప్లేలో 205 బంతులను ఎదుర్కొని 265 పరుగులు చేశాడు. అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల లిస్టులో 22 సిక్సర్లతో అందరికంటే ముందు నిలిచాడు. ఒక్క పవర్ ప్లేలోనే 31 ఫోర్లు, 16 సిక్సర్లు కొట్టాడంటే హిట్ మాన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ కప్ లో రోహిత్ బ్యాటింగ్ 61.73 శాతంగా ఉంది.

Siraj, Shami

Siraj, Shami

పేసర్ల త్రయం పదునైన బౌలింగ్
బౌలింగ్ లో పేసర్ల త్రయం ఇరగదీస్తున్నారు. బుమ్రా, సిరాజ్, షమీ కలిసి ప్రత్యర్థుల పని పడుతున్నారు. ముఖ్యంగా షమీ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా సూపర్బ్ బౌలింగ్ తో అందరినీ కట్టిపడేశాడు. ఆడింది 4 మ్యాచ్ లే అయినా 16 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. బెస్ట్ బౌలింగ్ లోనూ టాప్ 1, 3 స్థానాల్లో కొనసాగుతున్నాడు. బుమ్రా 15, జడేజా 14, కుల్దీప్ యాదవ్ 12, సిరాజ్ 10 వికెట్లు తీశారు. పదునైన బౌలింగ్ తో టీమిండియాకు కీలకంగా మారిన బుమ్రా అక్టోబర్‌ ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్‌కు నామినేట్ అయ్యాడు.

Also Read: మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌.. గౌత‌మ్ గంభీర్ ఏమ‌న్నాడో తెలుసా..?

సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
టీమిండియాతో సెమీఫైనల్లో ఎవరు తలపడారనేది ఇంకా తేలలేదు. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ తలపడనుంది. ఇప్పటికైతే భారత్ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. 10 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానానికి ఏ జట్టు అర్హత సాధిస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​​ ఇంకా సెమీస్ రేసులోనే ఉన్నాయి.