Virat Kohli : సిక్సర్లతో విరుచుకుపడిన కోహ్లీ.. 81వ సెంచరీ లోడింగ్.. !
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమ్ఇండియా భావిస్తోంది.

Virat Kohli aggressive net session
Virat Kohli aggressive net session : దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమ్ఇండియా భావిస్తోంది. మొదటి టెస్టు మ్యాచులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం సన్నద్ధం అవుతోంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించాల్సి ఉంటుంది. అందుకనే ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన అందరూ నెట్ సెషన్‌లో పాల్గొన్నారు. అందరి కంటే ఎక్కువగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విరాట్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ అందరిని ఆకట్టుకుంటోంది.
ఎడమ చేతి బౌలర్, మరో పేసర్‌ను సైతం కోహ్లీ వదలలేదు. కాగా.. విరాట్ ఇదే ఫామ్‌ను రెండో టెస్టు మ్యాచులోనూ కొనసాగిస్తే మొదటి టెస్టులో మిస్ అయిన 81వ శతకాన్ని అందుకోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Virat Kohli smashing sixes in the practice session. [Kushan Sarkar/PTI] pic.twitter.com/AQZOa6JgKj
— Johns. (@CricCrazyJohns) January 1, 2024
సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 38 పరుగులు చేశాడు. రబాడ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో 82 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 1 సిక్స్ బాది 76 పరుగులు చేశాడు. సెంచరీ దిశగా దూసుకువెలుతున్న అతడిని మార్కొ జాన్సెన్ ఔట్ చేశాడు.
పేలవ రికార్డు..
రెండో టెస్టుకు వేదికైన కేప్‌టౌన్‌లో భారత రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇక్కడ భారత జట్టు ఆరు మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇంకో రెండు మ్యాచులను డ్రా చేసుకుంది. ఈ మైదానంలో భారత అత్యధిక స్కోరు 414 పరుగులు కాగా.. అత్యల్ప స్కోరు 135 పరుగులుగా ఉంది.