సగం తెలుసుకుని రావొద్దు.. రిపోర్టర్ మీద ఫైర్ అయిన కోహ్లీ

సగం తెలుసుకుని రావొద్దు.. రిపోర్టర్ మీద ఫైర్ అయిన కోహ్లీ

Updated On : March 2, 2020 / 12:41 PM IST

‘కాంట్రవర్సీలు చేయాలనుకుంటున్నావా.. దానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు.. సగం తెలివితో ప్రశ్నలు అడగొద్దని’ రిపోర్టర్‌పై ఫైర్ అయ్యాడు కోహ్లీ. చాలా రోజులుగా ఇంటర్వూల్లో ప్రశాంతంగా కనిపిస్తున్న విరాట్.. కివీస్‌తో టెస్టు సిరీస్ వైఫల్యం తర్వాత మరో సారి గుస్సాగా కనిపించాడు. రెండు టెస్టుల సిరీస్ గా జరిగిన మ్యాచ్‌లో భారత్ కు నిరాశ తప్పలేదు. 

అప్పటికే కూల్‌నెస్ కోల్పోయిన కోహ్లీ.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ‘విరాట్ నిన్న మైదానంలో నీ ప్రవర్తన గురించి నీ రియాక్షన్ ఏంటి. కేన్ విలియమ్సన్, అభిమానుల మీద ఒట్టేసిన దాని సంగతేంటి? ఓ భారత కెప్టెన్‌గా గ్రౌండ్‌లో మంచి వ్యక్తిగా ఉండాలి కదా?’ అని ప్రశ్నించాడు. దానికి కోహ్లీ నువ్వేం అనుకుంటున్నావంటూ మొదలుపెట్టాడు.

‘అక్కడ జరిగిన విషయాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకుని అప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడుగు. జరిగిన దానిపై సగం తెలుసుకుని సగం ప్రశ్నలు అడగొద్దు. అయినప్పటికీ నువ్వు కాంట్రవర్సీలు చేయాలనుకుంటున్నావా.. దానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. మ్యాచ్ రిఫరీతో ఆల్రెడీ మాట్లాడాను. జరిగిన దానిపై వాళ్లకు ఏ సమస్యా లేదు’ అని విరాట్ ముగించాడు. 

భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లోనూ కివీస్ విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్‌ సునాయాస విజయాన్ని అందుకుంది. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(52), బ్లండెల్‌(55) రాణించగా.. ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది కివీస్ జట్టు. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 242పరుగులు చెయ్యగా.. బౌలర్లు కష్టపడి ప్రత్యర్థిని తమకంటే తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేశారు.. అయితే తర్వాత రెండవ ఇన్నింగ్స్ ఆడిన భారత్ బ్యాట్స్‌మెన్‌ మళ్లీ జట్టుని కష్టాల్లోకి పెట్టారు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ టెయిలెండర్‌ జేమీసన్‌ చక్కగా 49 పరుగులు చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో  స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా (14), మయాంక్‌ అగర్వాల్‌ (3), కోహ్లి (14), రహానే (9)లు అంతా కలిసి కూడా అన్ని పరుగులు చెయ్యలేదు. ఛటేశ్వర్ పుజారా కొట్టిన 24పరుగులే టీమ్ లో అత్యధిక స్కోర్. టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది కివీస్.