Washington Sundar: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు భారీ షాక్‌.. గాయంతో ఐపీఎల్‌కు కీల‌క ఆల్‌రౌండ‌ర్ దూరం

Washington Sundar:ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌న్‌రైజ‌ర్స్‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ గాయం కార‌ణంగా ఈ సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.

Washington Sundar: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు భారీ షాక్‌.. గాయంతో ఐపీఎల్‌కు కీల‌క ఆల్‌రౌండ‌ర్ దూరం

Washington Sundar has been ruled out of the IPL

Updated On : April 27, 2023 / 5:01 PM IST

Washington Sundar:ఐపీఎల్ (IPL) 2023 సీజ‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad)కు అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం రెండు మ్యాచుల్లోనే విజ‌యం సాధించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. అస‌లే ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌న్‌రైజ‌ర్స్‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్(Washington Sundar) గాయం కార‌ణంగా ఈ సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. అయితే.. సుంద‌ర్ స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారు అన్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు.

వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఈ సీజ‌న్‌లో అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు. మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన సుంద‌ర్ తొలి ఆరు మ్యాచుల్లో క‌నీసం ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. అయితే ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా రాణించాడు. మూడు వికెట్లు తీయ‌డంతో పాటు 24 ప‌రుగులు చేశాడు. హ‌మ్మ‌య్య సుంద‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చాడు అని అభిమానులు అనుకునే లోపే అత‌డు గాయ‌ప‌డ్డాడు. “తొడ కండ‌రాల గాయం వ‌ల్ల కార‌ణంగా ఈ సీజ‌న్ నుంచి వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌ప్పుకున్నాడు. అత‌డు త్వర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాము.” అని ఎస్ఆర్‌హెచ్ ట్వీట్ చేసింది.

కీల‌క స‌మ‌యంలో జ‌ట్టుకు దూరం అవుతున్నందుకు నిజంగా చాలా బాధ‌గా ఉంద‌ని వాషింగ్ట‌న్ సుంద‌ర్ తెలిపాడు. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు ఆడ‌టాన్ని ఎంతో ఎంజాయ్ చేసిన‌ట్లు చెప్పాడు. ముఖ్యంగా ఉప్ప‌ల్‌లో పెద్ద సంఖ్య‌లో అభిమానుల మ‌ధ్య ఆడ‌డం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింద‌న్నాడు. త్వ‌ర‌లోనే తిరిగి వ‌చ్చి మ‌ళ్లీ ఆరెంజ్ ఆర్మీ అభిమానుల స‌మ‌క్షంలో మ్యాచ్ ఆడ‌తాన‌ని సుంద‌ర్ అన్నాడు.

అయితే.. ప్ర‌స్తుత స‌మ‌యంలో సుంద‌ర్ దూరం అవ్వ‌డం నిజంగా స‌న్‌రైజ‌ర్స్‌కు ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ఈ విష‌యం తెలిసిన అభిమానులు అత‌డు త్వ‌ర‌గా కోలుకుని మైదానంలో అడుగుపెట్టాల‌ని ఆకాంక్షిస్తున్నారు.