Wasim Jaffer: శుభ్‌మన్ గిల్‌పై వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Wasim Jaffer
Wasim Jaffer: బంగ్లాదేశ్ తో ఇటీవల జరిగిన మూడో వన్డేలో భారత్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ మరో బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందువరకు టీమిండియా ఓపెనర్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడని, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తర్వాత మూడో స్థానంలో ఉన్నాడని చెప్పారు.
అయితే, ఇటీవల ఇషాన్ కిషన్ 10 సిక్సులు 24 ఫోర్లు బాది, ప్రపంచంలోనే అత్యధిక వేగంగా 200 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా నిలిచిన తీరుతో ఇప్పుడు టీమిండియా ఓపెనర్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలోకి పడిపోయాడని చెప్పారు. దీంతో శుభ్‌మన్ గిల్‌కు టీమిండియాలో చోటు లభించకపోవడం దురదృష్టకమని అన్నారు.
ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆటతీరు గురించి కూడా వసీం జాఫర్ స్పందించారు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ లో శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓపెనర్ గా తనకు లభించిన అవకాశాన్ని శిఖర్ ధావన్ బాగా వాడుకున్నాడని చెప్పారు.
ఈ మధ్య భారత ప్లేయర్లు జట్టుకు దూరం అవుతుండడం లేదా కొందరు మధ్యలోనే జట్టు నుంచి వెళ్లిపోతుండడం వంటివి జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమయంలో శిఖర్ ధావన్ ఫాం కోల్పోతే ఎవరిని టీమ్ కు ఎంపిక చేయాలన్న విషయంపై సెలెక్టర్లు బాగా ఆలోచించాల్సి వస్తుందని అన్నారు.