USA vs WI : అమెరికా ఇంటికి.. వెస్టిండీస్ ఆశ‌లు స‌జీవం..

గ్రూపు ద‌శ‌లో అద్భుత విజ‌యాలు సాధించి సూప‌ర్ 8కి చేరుకుంది అమెరికా.

USA vs WI : అమెరికా ఇంటికి.. వెస్టిండీస్ ఆశ‌లు స‌జీవం..

PIC Credit : ICC

United States vs West Indies : గ్రూపు ద‌శ‌లో అద్భుత విజ‌యాలు సాధించి సూప‌ర్ 8కి చేరుకుంది అమెరికా. సూప‌ర్‌8లో ఏదైన సంచ‌ల‌నాలు చేస్తుందేమోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. బార్బ‌డోస్ వేదిక‌గా శనివారం వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అమెరికా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫ‌లితంగా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఇంటి బాట ప‌ట్టింది.

ఈ మ్యాచ్‌లో అమెరికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అమెరికా బ్యాట‌ర్ల‌లో ఆండ్రీస్ గౌస్ (29; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), నితీశ్ కుమార్ (20; 19 బంతుల్లో, 2 ఫోర్లు)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. విండీస్ బౌల‌ర్ల‌లో రోస్టన్ ఛేజ్, ఆండ్రీ రసెల్ లు చెరో మూడు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్ రెండు, మోతీ ఓ వికెట్‌ ప‌డ‌గొట్టాడు.

బంగ్లాదేశ్‌తో జాగ్రత్త.. ఈ మూడు సమస్యలను అధిగమిస్తే కప్ టీమిండియాదే!

అనంత‌రం ల‌క్ష్యాన్ని విండీస్ 10.5 ఓవ‌ర్లో ఒక్క వికెట్ కోల్పోయి అందుకుంది. విండీస్ బ్యాట‌ర్ల‌లో షై హోప్ (82 నాటౌట్‌; 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించ‌గా నికోల‌స్ పూర‌న్ (27 నాటౌట్; 12 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు.

దంచికొట్టిన షై హోప్..

సూప‌ర్ 8 ద‌శ‌లో మొద‌టి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయింది. దీంతో నెట్ ర‌న్‌రేటును భారీగా పెంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా విండీస్ బ్యాట‌ర్లు దూకుడుగా ఆడారు. వాస్త‌వానికి ఆరంభంలో షై హోప్ క్రీజులో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇక క్రీజులో కుదురుకున్న త‌రువాత దంచడమే ప‌నిగా పెట్టుకున్నాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (15; 14 బంతుల్లో 2 ఫోర్లు) బంతికో పరుగు చొప్పున ఆడినా హోప్ బాదుడుతో విండీస్ ప‌వ‌ర్ ప్లేలో 58 ప‌రుగులు చేసింది.

Sania Mirza : ష‌మీతో సానియా మీర్జా పెళ్లి..? మౌనం వీడిన టెన్నిస్ స్టార్ తండ్రి

ఏడో ఓవ‌ర్‌లో జాన్సన్‌ను హర్మీత్ సింగ్ ఔట్ చేశాడు. ఇది అమెరికాకు లాభం చేకూర్చ‌క‌పోగా న‌ష్టాన్నే మిగిల్చింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన నికోల‌స్ పూర‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఓ వైపు హోప్ మ‌రో వైపు పూర‌న్ లు పోటాపోటీగా బౌండ‌రీలు బాద‌డంతో విండీస్ 11 ఓవ‌ర్ల‌లోపే ల‌క్ష్యాన్ని అందుకుంది.

వెస్టిండీస్ త‌న చివ‌రి మ్యాచ్‌ను జూన్ 24న ద‌క్షిణాఫ్రికాతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే సెమీస్ చేరుకునేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి.