పాపం రింకు సింగ్.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయడకపోవడంపై సీనియర్ల ఆశ్చర్యం

షార్ట్ ఫార్మాట్ బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకు సింగ్‌ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టాప్ 15కు సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పాపం రింకు సింగ్.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయడకపోవడంపై సీనియర్ల ఆశ్చర్యం

Rinku Singh (Photo Credit: @KKRiders)

Rinku Singh: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 కోసం 15 మంది ఆటగాళ్లతో బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా షార్ట్ ఫార్మాట్ బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకు సింగ్‌ను టాప్ 15కు సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రింకు సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్, వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ ఇయాన్ బిషప్ ఆశ్చర్యపడ్డారు. తాజా ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా రాణించకపోవడంతో అతడికి అవకాశం రాలేదన్న అభిప్రాయాన్ని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యక్తం చేశారు.

ఐపీఎల్ ఒక్కటే కొలబద్ద కాదని, ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున రింకు సింగ్ చేసిన ప్రదర్శనను విస్మరించకూడదని ఇర్ఫాన్ ప‌ఠాన్ పేర్కొన్నారు. స్టార్ స్పోర్ట్స్‌లో ఫించ్ మాట్లాడుతూ.. రింకు సింగ్‌ను పక్కనపెట్టి నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఇద్దరు స్పిన్నర్లు సరిపోతారని అన్నారు. రింకు సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో బాగానే రాణించాడని, టీ20ల్లో అతడి బ్యాటింగ్ సగటు 60 లేదా 70 మధ్యలో ఉందని ఇయాన్ బిషప్ అన్నారు. రింకు సింగ్ కంటే ఆల్‌రౌండ‌ర్ అయిన‌ అక్షర్ పటేల్‌ను అదనపు స్పిన్నర్‌గా ఎంపికచేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

“తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో రింకు సింగ్ ఫామ్ గొప్పగా లేదు. అతడికి పెద్దగా అవకాశాల కూడా రాలేదు. సెలక్టర్లు అందుకే అతడిని ఎంపిక చేయలేదు. ఎడమ చేతి పేస్ బౌలర్ టి నటరాజన్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడికి జట్టులో స్థానం దక్కుతుందని అనుకున్నాన”ని స్పోర్ట్స్ టుడేతో సునీల్ గవాస్కర్ చెప్పారు. ఐపీఎల్‌లో సరిగా ఆడడకపోవడంతో శుభ్‌మ‌న్ గిల్‌ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడని అన్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నమెంట్‌లో అంచనాల మేరకు రాణిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కేఎల్ రాహుల్‌, రుతురాజ్ గైక్వాడ్‌ల‌కు నో ఛాన్స్‌

కాగా, శుభ్‌మ‌న్ గిల్‌తో పాటు రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.. రిజర్వ్ ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. టాప్ 15 టీములో ఎవరైనా ఆడకపోతే వీరికి ఛాన్స్ ఇస్తారు.

Also Read: ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్ట‌గ‌ల బ్యాట‌ర్ ఎవ‌రు..? రోహిత్, సూర్య కాదు.. షాకింగ్ స‌మాధానం చెప్పిన యువీ